వలస కూలీలు ఎక్కడ వారెక్కడే ఉండాలి- కేంద్రం

వలస కూలీలుఎక్కడ వారెక్కడే ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూలీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనుమతినివ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. వలస కూలీలు ఉన్నచోటనే వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి హమీ పనులు కల్పించాలని వెల్లడించింది.
వీరంతా ఉపాధి పొందాలా స్థానిక అధికారులను కలిసి పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించింది. కరోనా రాకాసి కారణంగా భారతదేశం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. దీంతో ఎక్కడికక్కడనే జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ మొత్తం నిలిచిపోయింది. ప్రధానంగా వలస కూలీలపై తీవ్ర ప్రభావం చూపింది. తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కాలి నడకన, ఇతర మార్గాల ద్వారా వారు ఊర్లకు వెళ్లిపోతున్నారు.
ఈ క్రమంలో లాక్ డౌన్ ను మే 03వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత..కొన్ని రంగాలకు మినహాంపునిచ్చింది. పలు రంగాలకు సడలింపు ఇచ్చినా..వలస కూలీలు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నారో అక్కడే ఉండాలని తాజాగా కేంద్రం వెల్లడించింది. నిర్మాణ, గ్రామీణ, ఉపాధి, పరిశ్రమల్లో కార్యకలాపాలకే అనుమతినిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన ఆదేశాల ప్రకారం..వలస కూలీలు ఎక్కడి వారెక్కడే ఉండిపోనున్నారు.