విక్రమ్ ల్యాండర్ కూలిపోయింది: నాసా తీసిన ఫొటోలు ఇవే

  • Published By: vamsi ,Published On : September 27, 2019 / 04:56 AM IST
విక్రమ్ ల్యాండర్ కూలిపోయింది: నాసా తీసిన ఫొటోలు ఇవే

Updated On : September 27, 2019 / 4:56 AM IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపైకి పంపించిన చంద్రయాన్-2 విఫలం అయ్యింది. ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కుప్పకూలిపోగా.. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ జరిగినట్లు నాసా తన ప్రకటనలో వెల్లడించింది. ఎర్త్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయిన అనంతరం విక్రమ్ ల్యాండర్ కూలినట్లు నాసా గుర్తించింది. ఈ విషయాన్ని నాసా ట్విట్టర్ ద్వారా తెలిపింది. 

విక్రమ్ ల్యాండర్ కూలిన ప్రాంతాన్ని మాత్రం ఇప్పటికీ గుర్తించలేకపోయామని నాసా తెలిపింది. ఈ మేరకు నాసా తన అధికారిక ట్విట్టర్ లో పేర్కొంది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా నాసా ట్వీట్ లో పెట్టింది. సెప్టెంబర్ 26వ తేదీన తీసిన ఫోటోలను విడుదల చేసింది నాసా. అయితే ఈ చిత్రాలను చీకట్లో తీశామని, దీంతో విక్రమ్ ఆచూకీ స్పష్టంగా కనిపెట్టలేకపోయినట్లు నాసా స్పష్టం చేసింది.

అక్టోబరులో ఆ ప్రాంతంలో వెలుగు వస్తుందని అప్పుడు కచ్చితంగా ల్యాండర్ విక్రమ్ ఆచూకీ కనిపెట్టే అవకాశం ఉందని నాసా ప్రకటించింది. జులై 22వ తేదీన చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకెళ్లగా ఆ తర్వాత ఒక్కో దశ విజయవంతంగా పూర్తి చేసుకుంటూ చంద్రుడి ఆర్బిటార్ లోకి చేరింది చంద్రయాన్ 2.

అనంతరం ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోగా విక్రమ్ చంద్రుడిపై దిగడానికి 2.1 కిలోమీటర్ల దూరంలో భూ కేంద్రంతో చంద్రయాన్ 2 కి సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి విక్రమ్ ల్యాండర్ తో సంకేతాలను పునరుద్ధరించేందుకు ఇస్రో తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం నాసా సపోర్ట్ కూడా తీసుకుంది. ఈ క్రమంలో నాసా జరిపిన పరిశోధనలో విక్రమ్ ల్యాండర్ కూలిపోయినట్లు వెల్లడైంది.