Chandrayaan-3: మరోసారి దేశం మీసం తిప్పడానికి ఇస్రో రెడీ.. నాలుగేళ్లు కష్టపడి మరీ మళ్లీ ఎందుకీ ప్రయోగం?

మళ్లీ అటువంటి తప్పు జరగకుండా చంద్రయాన్-3 డిజైన్‌లలో శాస్త్రవేత్తలు అనేక మార్పులు చేశారు.

Chandrayaan-3: మరోసారి దేశం మీసం తిప్పడానికి ఇస్రో రెడీ.. నాలుగేళ్లు కష్టపడి మరీ మళ్లీ ఎందుకీ ప్రయోగం?

Chandrayaan-3

Updated On : July 14, 2023 / 3:02 PM IST

Chandrayaan-3 ISRO : ఓటముల నుంచే భారత్ ఎన్నో నేర్చుకుంది.. అగ్ర రాజ్యాలు సైతం భారత్ (India) విజయాలను చూసి అబ్బురపడేలా తనను తానూ నిరూపించుకుంది. భారత కీర్తి ప్రతిష్ఠలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అమాంతం పెంచేస్తోంది. అంతరిక్ష రంగంలో భారత్ కు అనేక విజయాలు అందించి, అగ్ర రాజ్యాలకు దీటుగా పరిశోధనలు చేస్తోంది ఇస్రో. ఇప్పుడు చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టడానికి ఇస్రో సిద్ధమైంది.

చంద్రయాన్ 1 నుంచి షురూ..
మొదట 2008లో అక్టోబరు 22న చంద్రయాన్ 1. ఆ ప్రయత్నంలో భారత్ విజయవంతమైంది. చంద్రుడిపై నీటిజాడలను ఇస్రో గుర్తించింది. ఆ తర్వాత దాదాపు 11 ఏళ్ల అనంతరం చంద్రయాన్ 2 ప్రయోగాన్ని 2019లో ఇస్రో చేపట్టింది. చంద్రయాన్ 1కి కొనసాగింపుగా చంద్రయాన్ 2 ప్రాజెక్టు చేపట్టారు. చంద్రుడి ఉపరితలంపై నీరు ఎంత పరిమాణంలో ఉందో తెలుసుకునేందుకు చేపట్టారు.

అంతేగాక, ఉపరితలం కింద, పై వాతావరణంలోనూ అక్కడి పరిస్థితులను మరింతగా పరిశీలించాలని ఇస్రో భావించింది. చంద్రయాన్ 2 విజయవంతమైతే భారత్ అంతరిక్ష రంగంలో మరింత ప్రతిష్ఠను మూటగట్టుకునేది. చంద్రుడి ఉపరితలంపై అంతరిక్ష వాహనాన్ని ‘సాఫ్ట్‌ ల్యాండింగ్’ చేసిన నాలుగవ దేశంగా భారత్ నిలిచేది. ఇంతకుముందు రష్యా, అమెరికా, చైనా ఆ ఘనతను సాధించాయి.

మళ్లీ ఎందుకీ ప్రయోగం?
చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాండింగ్ కోసం నాలుగేళ్ల క్రితం ఇస్రో ప్రయత్నించినప్పటికీ, విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండ్ కావడంతో భారత్ నిరాశ చెందింది. మళ్లీ అటువంటి తప్పు జరగకుండా చంద్రయాన్-3 డిజైన్‌లలో శాస్త్రవేత్తలు అనేక మార్పులు చేశారు. ఈ ప్రయోగానికి రూ.615 కోట్ల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

చంద్రయాన్-3 ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం, చంద్రుడిపై తిరిగుతూ సమాచారాన్ని పంపేందుకు ఓ రోవర్‌ను ప్రవేశపెట్టడం, చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేయడం.. ఈ మూడు లక్ష్యాలను ఇస్రో పెట్టుకుంది.

ఈ సారి లక్ష్యం తప్పేదేలే..
ఉపగ్రహం అన్ని రకాల వాతావరణ పరిస్థితులను అధిగమించేలా పరీక్షలు చేశారు. ప్రొపల్షన్ సిస్టమ్‌(Propulsion System)తో పాటు హార్డ్‌ వేర్‌కు అనేక రకాల పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా కొన్ని నెలలుగా వాయిదాపడతూ వస్తున్న చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఎట్టకేలకు ఈ నెల 14న నిర్వహించాలని ఇస్రో నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోట నుంచి 2019 జులై 22న ప్రయోగించిన చంద్రయాన్-2 లూనార్ ఆర్బిట్ ను 2019 ఆగస్టు 20న చేరుకుంది. ఈ సారి జులై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగించే చంద్రయాన్-3 ఆగస్టు చంద్రుడిని ఆగస్టు 23 లేదా 24న చేరుకునే అవకాశం ఉంది. చంద్రయాన్-3 ప్రయోగాన్ని కూడా శ్రీహరికోటలోని షార్‌ నుంచి చేపడతారు.

ఎల్వీఎం-3 వాహకనౌక ద్వారా ప్రయోగం చేపట్టనున్నట్లు ఇప్పటికే ఇస్రో ప్రకటించింది. ఈ సారి సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తామని ఇస్రో పూర్తి విశ్వాసంతో ఉంది. గత ప్రయోగాలతో పోల్చితే మరింత బలమైన రోవర్ ను ఈ సారి జాబిలిపైకి పంపుతున్నారు.

ISRO : సూర్యుడు రహస్యాలను కనుగొనటానికి ఆదిత్య ఎల్1తో పాటు ఇస్రో లిస్టులో.. ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు