ఇక మా పార్టీ కాదు : చిన్మయానంద్ పై బీజేపీ వేటు

  • Published By: venkaiahnaidu ,Published On : September 25, 2019 / 10:00 AM IST
ఇక మా పార్టీ కాదు : చిన్మయానంద్ పై బీజేపీ వేటు

Updated On : September 25, 2019 / 10:00 AM IST

లా స్టూడెంట్ ని లైంగికంగా వేధించిన కేసులో గత వారం అరెస్ట్ అయిన మాజీ కేంద్రమంత్రి,బీజేపీ సీనియర్ లీడర్ స్వామి చిన్మయానంద్‌ (73)ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి తెలిపారు. చిన్మయానంద్ పై ఆరోపణలు వచ్చిన నెల రోజుల తర్వాత ఇవాళ(సెప్టెంబర్-25,2019)బీజేపీ నుంచి అధికారికంగా ఈ ప్రకటన వచ్చింది. 

చిన్మయానంద్ ను సీఎం యోగి,ప్రధాని మోడీ కాపాడాలనుకుంటున్నారా అంటూ ప్రతిపక్షాలు,సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సమయంలో…చిన్మయానంద్ పై బీజేపీ వేటు వేసింది. ఆయన ఇకపై బీజేపీ సభ్యుడు కాదని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ శ్రీవాత్సవ తెలిపారు. ఆయనను పార్టీ నుంచి తొలగించినట్లు తెలిపారు. అయితే ఎప్పుడు ఆయనను పార్టీ నుంచి తొలగించారో చెప్పాలని ప్రశ్నించగా…ఖచ్చితమైన డేట్ ఇవ్వలేమని కానీ చిన్మయానంద్ ఇకపై ఎంతమాత్రం బీజేపీ సభ్యుడు కాదని హరీష్ సమాదానమిచ్చారు.

షహజన్‌పూర్‌లో లా కాలేజీలో అడ్మిషన్‌ విషయమై తనకు సహాయపడిన చిన్మయానంద్‌..తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని బాధిత విద్యార్థిని ఆగస్టు 24న ఫేస్ బుక్‌లో పోస్టు చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాలేజ్‌ హాస్టల్‌ లో తాను స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసిన చిన్మయానంద్‌.. పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత యువతి సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో గత వారం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్మయానంద్‌ కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

 తాను నిర్వహించే కాలేజీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు చిన్మయానంద ఒప్పుకున్నారని గత వారం ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్‌ నవీన్ అరోరా తెలిపారు. బాధితురాలిని లైంగికంగా వేధించినట్లు, నగ్నంగా ఉన్న తనకు మసాజ్‌ చేయాల్సిందిగా ఆమెను ఇబ్బంది పెట్టినట్లు ఒప్పుకొన్నారని తెలిపారు. విచారణలో భాగంగా చిన్మయానంద్‌ తన నేరాన్ని అంగీకరించారని, తాను చేసిన పనులకు ఇప్పటికే సిగ్గుపడుతున్నానని, ఇక వాటి గురించి ఇంకా ఏం చెప్పలేనంటూ ఆయన పశ్చాత్తాపంతో కుంగిపోయినట్లు తెలిపారు.