CJI DY Chandrachud: మహిళలు ఇంట్లో చేసే పనికి జీతం లేదు.. సీజేఐ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ సమస్య భారతీయ మహిళలకు, ప్రత్యేకించి అట్టడుగున ఉన్నవారికి చాలా ముఖ్యమైనది. వివిధ వృత్తిపరమైన రంగాలలో మహిళలు గణనీయమైన సహకారం అందించినప్పటికీ, పురుషులతో పోలిస్తే వారు ఇప్పటికీ తక్కువ వేతనంతో ఉన్నారు

లింగ ఆధారిత వేతన వ్యత్యాసం, గృహిణుల హక్కులకు సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ భారీ ప్రకటన చేశారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గోప్యతను హక్కుల ఉల్లంఘనకు ఉపయోగించరాదని అన్నారు. భారత 19వ ప్రధాన న్యాయమూర్తి ఇఎస్ వెంకటరామయ్య స్మారకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి ప్రసంగిస్తూ, చట్టం ఉద్దేశ్యాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రదేశాలకు విస్తరించాలని అన్నారు.
గృహిణుల ఇంటి పనికి జీతం లేదు
ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మాట్లాడుతూ, ఒక ప్రైవేట్ స్థలమైన ఇంట్లో.. గృహిణి చేసే పనికి వేతనాలు చెల్లించడం లేదని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో నిర్దిష్ట సేవలకు పరిమితం చేయబడ్డారని, కొందరైతే శృంగార వృత్తులకే పరిమితమైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా వారి హక్కులకు భంగం కలుగుతోందని అన్నారు.
కార్పోరేట్ ఉద్యోగులకు లాగా గృహ సేవకులకు ప్రయోజనాలు అందవు
సమాజం మనకు నేర్పిన ఆలోచనలకు అతీతంగా మనసు విప్పడానికి సిద్ధంగా ఉంటేనే న్యాయ భావం అభివృద్ధి చెందుతుందని సీజేఐ అన్నారు. మన మనసు విప్పినప్పుడే ఇది జరుగుతుందని సూచించారు. “ప్రజలు తమ ఇళ్లలో సేవకులను నియమించుకున్నప్పుడు, చట్టం ఆ వ్యక్తికి కార్పొరేట్ ఉద్యోగితో సమానమైన ప్రయోజనాలను ఇస్తుందా?” అని ప్రశ్నించారు.
మహిళలకు తక్కువ జీతం
భారతదేశంలోని లింగ వేతన వ్యత్యాసంపై ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ సమస్య భారతీయ మహిళలకు, ప్రత్యేకించి అట్టడుగున ఉన్నవారికి చాలా ముఖ్యమైనది. వివిధ వృత్తిపరమైన రంగాలలో మహిళలు గణనీయమైన సహకారం అందించినప్పటికీ, పురుషులతో పోలిస్తే వారు ఇప్పటికీ తక్కువ వేతనంతో ఉన్నారు’’ అని అన్నారు.