CJI Justice NV Ramana : ‘మహారాష్ట్ర’ వివాదంపై సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ కేసులో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది రాజకీయంగా సునిశితమైన కేసు. మేం ఒకరి పక్షాన ఉన్నామనే అభిప్రాయాన్ని కల్పించాలని అనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు.

CJI Justice NV Ramana : ‘మహారాష్ట్ర’ వివాదంపై సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

Cji Nv Ramana

Updated On : July 20, 2022 / 9:08 PM IST

CJI Justice NV Ramana : మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వంలో పెను మార్పులు జరిగాయి. శివసేనను చీల్చి..ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చిన ఏక్‌నాథ్‌ షిండే ఇప్పుడు పార్టీపై పట్టుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీని కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. ఈ విషయంపై శివసేనకు చెందిన ఇరువర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ల విచారణను ఆగస్ట్‌ 1వ తేదీకి వాయిదా వేసింది.

శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేసేందుకు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి సమయం ఇచ్చింది. కాగా, ఉద్దవ్ ఠాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని షిండే వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే సీజేఐ ధర్మాసనాన్ని కోరారు.

Shiv Sena : శివసేనలో మరో సంక్షోభం..షిండే వర్గంలో చేరనున్న ఎంపీలు

ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ కేసులో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది రాజకీయంగా సునిశితమైన కేసు. మేం ఒకరి పక్షాన ఉన్నామనే అభిప్రాయాన్ని కల్పించాలని అనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. వాదనలు విన్న తర్వాత కొన్ని సమస్యలపై విస్తృత ధర్మాసనం పరిశీలన అవసరమనిపిస్తోందని, వచ్చే బుధవారంలోగా అన్ని పక్షాలు దీనిపై అభిప్రాయాలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.