ల్యాండింగ్ టైంలో స్కిడ్ అయిన మహా సీఎం హెలికాఫ్టర్

  • Published By: venkaiahnaidu ,Published On : October 11, 2019 / 04:05 PM IST
ల్యాండింగ్ టైంలో స్కిడ్ అయిన మహా సీఎం హెలికాఫ్టర్

Updated On : October 11, 2019 / 4:05 PM IST

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ ల్యాండింగ్‌ సమయంలో స్కిడ్‌ అయింది. రాయ్‌గడ్‌ జిల్లాలో శుక్రవారం(అక్టోబర్-11,2019) సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. 

రాయ్‌గడ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఫడ్నవీస్‌ హెలికాఫ్టర్‌లో వచ్చారు. అయితే హెలిప్యాడ్‌ దగ్గర నేల తడిగా ఉండటంతో పైలట్‌ నియంత్రణ కోల్పోయాడు. వెంటనే తేరుకుని కొద్ది సెకన్లలోనే హెలికాఫ్టర్‌ క్షేమంగా ల్యాండ్‌ అయ్యేలా చేశాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హెలికాఫ్టర్‌లో సీఎం ఫడ్నవీస్‌తో పాటు ఆయన పర్సనల్‌ అసిస్టెంట్‌, ఒక ఇంజనీర్‌, పైలట్‌, కో-పైలట్‌లు ఉన్నారు.

నేల తడిగా ఉండటంతోనే ఇలా జరిగిందని అధికారులు వెల్లడించారు. సీఎంతో పాటు మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నట్టు జిల్లా ఎస్పీ అనిల్ పరాస్కర్ తెలిపారు. కాగా, గతంలో ఫడ్నవీస్‌ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ లాథూర్‌లో క్రాష్‌ ల్యాండింగ్‌ అయిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి సీఎం క్షేమంగా బయటపడ్డారు.

వర్షం కారణంగా హెలిప్యాడ్ మెత్తగా, మృదువుగా మారిందని, దీని కారణంగా హెలికాఫ్టర్ యొక్క చక్రాలు బురదలో రెండు లేదా మూడు అంగుళాలు మునిగిపోయాయని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.