CM Stalin: నన్ను పొగిడితే చర్యలు తప్పవు.. స్టాలిన్ వార్నింగ్

అధికారంలో ఉన్న పార్టీ నేతలు ముఖ్యమంత్రులను, ప్రధానులను పొగడడం మన దేశంలో కొత్తేమి కాదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులకు చేసే భజన..

CM Stalin: నన్ను పొగిడితే చర్యలు తప్పవు.. స్టాలిన్ వార్నింగ్

Cm Stalin

Updated On : August 29, 2021 / 1:48 PM IST

CM Stalin: అధికారంలో ఉన్న పార్టీ నేతలు ముఖ్యమంత్రులను, ప్రధానులను పొగడడం మన దేశంలో కొత్తేమి కాదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులకు చేసే భజన అంతా ఇంతా కాదు. ఏకంగా అసెంబ్లీలలో కూడా తమ సీఎం రాముడు, భీముడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంటారు. నువ్వు దేవుడువి స్వామి.. నువ్వు తలచుకుంటే అయిపోద్ది.. అంటూ సినిమా డైలుగులు నాలుగు బట్టీపట్టి కీర్తించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే.. ఇలాంటి చర్యలకు తమిళనాడు సీఎం స్టాలిన్ చెక్ పెట్టేశారు.

రాష్ట్రంలో తనదైన మార్క్ పాలనతో దూసుకుపోతున్న సీఎం స్టాలిన్.. ప్రతి చిన్న అంశాన్ని కూడా సున్నితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీలో తనని పొగిడే వాళ్లపై చర్యలు తప్పవని తమ పార్టీ సభా సభ్యులను హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చలు జరగాలి కానీ.. తనకు భజనలు అక్కర్లేదన్నారు. అసెంబ్లీలో సమయం దొరికితే పరమానందంగా భావించి ప్రజా సమస్యలను లేవనెత్తాలి కానీ.. తనను పొగడినందువలన ప్రజలకు ఒరిగేదేమిలేదన్నారు.

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. శనివారం ఓ ఎమ్మెల్యే సీఎంను ప్రశంసిస్తూ మాట్లాడుతున్నారు. కాసేపటికి సహనం నశించిన సీఎం స్టాలిన్ మధ్యలో మైకు అందుకొని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే అనవసర ప్రసంగాలు మాని బడ్జెట్, ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు. ఇకపై ఎవరైనా సరే సభలో తనను పొగుడుతూ సభా సమయాన్ని వృధా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టాలిన్ నిర్ణయంపై ఇప్పుడు ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతోంది.