తిరిగి విధుల్లోకి అభినందన్

వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి విధుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే IAF కంబాట్ పైలట్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్ మెడిసిన్ ఇన్‌స్టిట్యూట్… మరికొద్ది వారాల్లో ఆయనకు తుది పరీక్షలు జరిపి క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ స్థావరాలపై భారత ఆర్మీ చేసిన దాడుల్లో అభినందన్ వర్ధమాన్ అసామాన్య ప్రతిభ చూపాడు.
ఫిబ్రవరి 27న పాకిస్తాన్ ఫైటర్ జెట్ ఎఫ్-16ను నేలకూల్చి చరిత్ర సృష్టించాడు. రెండు తరాలవారు చేయలేని పనిని చేసి చూపించాడు. మిగ్ విమానంతో F-16 కూల్చడం ద్వారా అహో అభినందన్ అనిపించుకున్నాడు. దీనికిగాను యుద్ధవీరులకు ఇచ్చే అవార్డును వర్ధమాన్‌కు అందించే అవకాశం ఉంది. వీర్ చక్ర పురస్కారానికి ఆయన పేరును ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ఫైటర్ విమానాల మధ్య జరిగిన యుద్ధంలో తన మిగ్ విమానం కూలిపోవడంతో పాక్‌కు బందీగా చిక్కిన అభినందన్.. 60గంటల నిర్బంధం తర్వాత విడుదలయ్యాడు.
భారత్‌కు చేరుకున్న తర్వాత ఆయనకు పలు రకాల వైద్య పరీక్షలు జరిపారు. ఆయన ఫిట్‌నెస్‌స్థాయి ఏ మేరకు ఉందనే దానిని పరీక్షించారు. అనంతరం ఆయనకు 12 వారాల విశ్రాంతినిచ్చారు. రెస్ట్ టైమ్ ముగియడంతో ఆయన తిరిగి విధుల్లోకి చేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే.. ఆయనకు ఏరోస్పేస్ మెడిసిన్ ఇన్‌స్టిట్యూట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. త్వరలోనే ఆ లాంఛనం పూర్తి కానుంది. మళ్లీ యుద్ధవిమానం నడిపేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఇటీవలే అభినందన్ తెలిపారు.