Rahul Gandhi: పోరాటం ఆగదు.. హరియాణా ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
హరియాణా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా ఫలితాల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi
Haryana Election Result 2024: హరియాణా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా జమ్మూకశ్మీర్ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పేర్కొన్న రాహుల్.. హరియాణా ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో హరియాణాలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 90 సీట్లకుగాను 48 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించగా.. 37 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఐఎన్ఎల్డీ రెండు, స్వతంత్ర అభ్యర్ధులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. బీజేపీకి 39.94శాతం పోలవగా.. కాంగ్రెస్ పార్టీకి 39.09శాతం ఓట్లు పోలయ్యాయి. హరియాణాలో పోలింగ్ తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. కానీ, అందరి అంచనాలను తలకిందలు చేస్తూ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు విరుద్దంగా బీజేపీకి మరోసారి ప్రజలు పట్టంకట్టారు. ఈ ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Haryana: హర్యానాలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన ఆప్.. కలిసి పోటీచేస్తే ఫలితాలు మరోలా ఉండేవా..
రాహుల్ గాంధీసైతం హరియాణా ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ట్వీట్ ప్రకారం.. జమ్మూ కశ్మీర్ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్రంలో భారతదేశం సాధించిన విజయం. రాజ్యంగ విజయం. ప్రజాస్వామ్య ఆత్మగౌరవ విజయమని అన్నారు. మేము హర్యానాలో ఊహించని ఫలితాలను విశ్లేషిస్తున్నాము. పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల సంఘానికి తెలియజేస్తాం. హరియాణాలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ప్రజలందరికీ, అవిశ్రాంతంగా కృషి చేస్తున్న మా కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మేము హక్కుల కోసం, సామాజిక, ఆర్థిక న్యాయంకోసం, సత్యం కోసం పోరాటాన్ని కొనసాగిస్తాం. మా గళాన్ని పెంచుతూనే ఉంటామని రాహుల్ పేర్కొన్నారు.
హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీచేసిఉంటే కాంగ్రెస్ కూటమి విజయం సాధించే అవకాశాలు ఉండేవన్న చర్చ జరుగుతుంది. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ఓటమి చెందిన ఓట్ల కంటే ఆప్ అభ్యర్ధులకు పోలయిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, ఆప్ కు వచ్చిన ఓట్ల శాతం కలుపుకొని చూస్తే బీజేపీ కంటే దాదాపు 1శాతం ఓటింగ్ షేర్ ఎక్కువగా ఉంది.
జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్, ఎన్సీ కూటమి అధికారంలోకి వచ్చింది. మొత్తం 90 స్థానాలకుగాను నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) 42 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 29 స్థానాల్లో, కాంగ్రెస్ ఆరు, పీడీపీ మూడు, జేపీసీ, సీపీఎం, ఆప్ పార్టీలు ఒక్కో స్థానాల్లో విజయం సాధించగా.. స్వతంత్ర అభ్యర్థులు ఏడు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. ఇక్కడ బీజేపీకి 25.64శాతం ఓట్లు పోలుకాగా.. ఎన్సీకి 23.43శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి 11.97శాతం, పీడీపీ 8.87 శాతం ఓట్లను దక్కించుకుంది.
जम्मू-कश्मीर के लोगों का तहे दिल से शुक्रिया – प्रदेश में INDIA की जीत संविधान की जीत है, लोकतांत्रिक स्वाभिमान की जीत है।
हम हरियाणा के अप्रत्याशित नतीजे का विश्लेषण कर रहे हैं। अनेक विधानसभा क्षेत्रों से आ रही शिकायतों से चुनाव आयोग को अवगत कराएंगे।
सभी हरियाणा वासियों को…
— Rahul Gandhi (@RahulGandhi) October 9, 2024