రెండు సీట్లు మేమే వదిలేస్తాం.. మన లక్ష్యం ఒక్కటే!

  • Published By: vamsi ,Published On : March 9, 2019 / 03:56 PM IST
రెండు సీట్లు మేమే వదిలేస్తాం.. మన లక్ష్యం ఒక్కటే!

Updated On : March 9, 2019 / 3:56 PM IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ కూడా తమ కూటమిలో ఉందంటూ సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి  జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు. ‘మాకు రెండు సీట్లు వదిలేశామని అఖిలేశ్‌ భావిస్తే, మేము కూడా వారి కోసం రెండు-మూడు సీట్లను వదిలేస్తాం’ అని అన్నారు.  ఎస్పీ-బీఎస్పీ పార్టీలు తీసుకున్న నిర్ణయాలను మేము గౌరవిస్తామని, వారి మార్గాన్ని చూసుకునే హక్కు వారికి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.  కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒంటరిగా పోటీ చేయనున్నామని ఆయన స్పష్టం చేశారు. 
‘ఎస్పీ-బీఎస్పీ వేరే దారిలో ప్రయాణించాలని అనుకుంటున్నప్పటికీ మా అందరి లక్ష్యం మాత్రం ఒక్కటేనని ఆయన అన్నారు. ఒకే భావజాలం కలిగిన పార్టీలన్నీ ఒకేలా ఆలోచించాలి. మేము అన్ని పార్టీలను గౌరవిస్తాం. మన దారులు వేరైనా లక్ష్యాలు ఒక్కటే’ అన్నారు. ఎస్పీ-బీఎస్పీ కూటమి ఏర్పాటు చేయడం కాంగ్రెస్‌ పార్టీకి ఓ పెద్ద సవాలేనని, అయితే సవాళ్లను అవకాశాలుగా మలచుకునేందుకు కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా తాము పనిచేస్తున్నట్లు చెప్పారు.