దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ డ్రై రన్

Corona vaccine dry run launched nationwide : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభమైంది. వ్యాక్సిన్ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా ఈ డ్రై రన్ సాగనుంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం డ్రై రన్ నిర్వహించింది. ఇప్పుడు మిగిలిన.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రై రన్ జరగుతోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
కొత్త సంవత్సరంలో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ముందస్తుగా దేశ వ్యాప్త డ్రై రన్ నిర్వహిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డమ్మీ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది . రాష్ట్రాల రాజధానులు, వివిధ జిల్లాల్లో కనీసం మూడు ప్రాంతాల్లో వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహిస్తున్నారు అధికారులు. కష్టతరమైన కొండ ప్రాంతాలున్న భూభాగంతో పాటు.. తక్కువ రవాణా సౌకర్యమున్న జిల్లాల్లోనూ డ్రై రన్ జరగుతోంది.
వ్యాక్సిన్ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా డ్రై రన్ సాగనుంది. కొన్ని రకాల వ్యాక్సిన్లకు అతిశీతల వాతావరణంలో భద్రపర్చడమే పెద్ద సవాల్. ఈ క్రమంలో కోల్డ్ స్టోరేజీ వ్యవస్థ, పంపిణీలో తలెత్తే సమస్యలు, వ్యాక్సినేషన్ అనంతరం ఎదురయ్యే సమస్యలపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. డ్రై రన్ సందర్భంగా ఎదురైన సమస్యలను సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రానికి నివేదిస్తాయి.