కరోనా ఆందోళనకరమేనన్న జై శంకర్…ప్రయాణాలు వద్దని సూచన

భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయని, కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరమేనని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇవాళ(మార్చి-12,2020)పార్లమెంట్ కు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 73కు పెరిగాయని అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ స్పందన అవసరమని ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రయాణాలు సురక్షితం కాదని,ఇది రిస్క్‌తో కూడుకున్నదని జైశంకర్ తెలిపారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు.
ఇక ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సహకరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ కోరారు. మంత్రి లోక్‌సభలో మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు సమూహాల్లో కలువరాదని సూచించారు. మరోవైపు కరోనాను అంతర్జాతీయ మహమ్మారిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన నేపథ్యంలో అన్ని దేశాలు మరింత అలర్ట్ అయ్యాయి. విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 10 కింద చర్యలు చేపట్టేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఎపిడెమిక్ డిసీజెస్ చట్టం సెక్షన్ 2ను ప్రయోగించాలని అన్ని రాష్ట్రాలనూ కేంద్రం కోరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకి ఇప్పటివరకు 4వేల500మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు బ్రిటన్ హెల్త్ మినిస్టర్ సహా వివిధ దేశాల్లోని పలువురు ఎంపీలకు,సెలబ్రిటీలకు కూడా కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా 1లక్షా 15వేలమందికి పైగా ప్రస్తుతం కరోనా సోకి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇక వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలో,భారత్ లో కరోనా సోకినవాళ్లు నెమ్మదిగా కోలుకుంటున్నారు. చైనాలో చాలామంది పేషెంట్లు డిశ్చార్జ్ కూడా అయ్యారు. కరోనాతో ఎక్కువ రిస్క్ వృద్ధులకేనని అర్థమవుతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినవారిలో 99శాతం మంది వృద్ధులే. అది కూడా మృతుల్లో ఎక్కువమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులే.
See Also | మెడికల్ సర్టిఫికేట్ కిరికిరి : ఇటలీలో చిక్కుకున్న తెలంగాణ స్టూడెంట్స్