కరోనా విజృంభిస్తుంటే కూతురి పెళ్లి చేశాడు..సీన్ కట్ చేస్తే

  • Published By: madhu ,Published On : March 22, 2020 / 05:13 AM IST
కరోనా విజృంభిస్తుంటే కూతురి పెళ్లి చేశాడు..సీన్ కట్ చేస్తే

Updated On : March 22, 2020 / 5:13 AM IST

కరోనా విజృంభిస్తుంటే.. ఓ వ్యక్తి తన కూతురి వివాహం అంగరంగ వైభవంగా చేశాడు. భారీగా అతిథులు వచ్చారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కరోనా వైరస్ వల్ల చాలా మంది చనిపోతున్నారని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. కానీ వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ వ్యక్తి చేసిన వివాహం వైరల్ గా మారిపోయింది. ఇక సీన్ కట్ చేస్తే..ఆ తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

వివరాల్లోకి వెళితే…
కేరళ రాష్ట్రంలో అల్లప్పుజా నగరంలోని అరాట్టువాజీ ప్రాంతానికి చెందినయ షమీర్ అహ్మద్ తన కూతురికి వివాహం నిశ్చయించాడు. బంధువులు, స్నేహితులను వివాహానికి రావాలని ఆహ్వానించాడు. కానీ కరోనా రాష్ట్రంలో వ్యాపిస్తోంది. అక్కడి ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది. వివాహం జరిపించాలంటే..కేవలం 60 మందిని మాత్రమే పిలుచుకోవాలని తహశీల్దార్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు షమీర్ ఒకే చెప్పాడు. 

టౌన్ హాల్ లో వివాహం జరుగుతోంది. పరిమితికి మించి..ఈ వేడుకకు హాజరయ్యారు. సుమారు వేయి మంది అతిథులు వచ్చారు. వీరంతా కనీస జాగ్రత్తలు పాటించలేదు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని స్థానిక కౌన్సిలర్ మైక్ ద్వారా సూచించారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు…షమీర్ పై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘించారని, అందుకే…ఐపీసీ సెక్షన్ 269, 188, 118 (ఈ) కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు సర్కిల్ ఇన్స్ పెక్టర్ వినోద్ వెల్లడించారు. 

మరోవైపు కేరళ రాష్ట్రం మహమ్మారిని అరికట్టడానికి భారీ చర్యలు తీసుకొంటోంది. ఇటీవలే రూ. 20 వేల కోట్ల ప్యాకేజీని సీఎం పినరయి విజయన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల వైరస్ వ్యాపించడం లేదు. వైరస్ సోకిన వారిని ప్రత్యేక కేంద్రాలకు తరలించి పకడ్బంది ఏర్పాట్లు చేసింది.