కరోనా కేసుల్లో భారత్ వరల్డ్ రికార్డు, ఒక్కరోజే 84వేలకు దగ్గరగా కేసులు నమోదు, రోజువారీ కేసుల్లో ప్రపంచంలోనే అత్యధికం

భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రోజువారి కరోనా కేసుల్లో భారత్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఒక్కరోజు వ్యవధిలో ఏ దేశంలోనూ నమోదు కానన్ని కేసులో ఇండియాలో బయటపడ్డాయి. గత 24గంటల్లో మన దేశంలో 83వేల 883 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒకేరోజులో 80వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే ప్రథమం. అంతేకాకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదుకాలేదు. దీంతో భారత్ లో కరోనా కేసుల సంఖ్య 38లక్షలు దాటింది. ఇక మరణాల సంఖ్య 67వేలు క్రాస్ అయ్యింది.
కేసులే కాదు కొవిడ్ మరణాల సంఖ్యా పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా మరో 1043 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కొవిడ్ మృతుల సంఖ్య 67వేల 376కు చేరింది.
నిన్న ఒక్కరోజే 11లక్షల 70వేల శాంపిల్స్‌ను పరీక్షించారు. గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 38లక్షల 53వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 29.70లక్షల మందికి పైగా కోలుకున్నారు. మరో 8లక్షలకు పైగా బాధితులు చికిత్సపొందుతున్నారు. నిన్న మరో 68వేల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.1శాతానికి చేరింది. కరోనా మరణాల రేటు 1.7శాతంగా కొనసాగుతోంది.