పీఎస్‌ఎల్‌వీ-సీ 45 కౌంట్‌డౌన్: గగనతలంలో మరో అధ్భుతం

  • Published By: vamsi ,Published On : March 31, 2019 / 01:19 AM IST
పీఎస్‌ఎల్‌వీ-సీ 45 కౌంట్‌డౌన్: గగనతలంలో మరో అధ్భుతం

Updated On : March 31, 2019 / 1:19 AM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో సరికొత్త వినూత్న రాకెట్ ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. నెల్లూరు జిల్లా సుళ్లూరు పేటలోని శ్రీహరికోటలో సతీష్ థావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 45 రాకెట్ ప్రయోగంకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 1న ఉదయం 9:27గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 45 రాకెట్‌ నింగిలోకి వెళ్లనుంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై ఒక స్వదేశీ, 28 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్‌వీ-సీ 45 నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఈ రాకెట్‌కు శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్‌, ప్రయోగ రిహార్సల్స్‌‌ను ఇప్పటికే పూర్తి చేశారు. షార్‌ డైరెక్టర్‌ పాండియన్‌ అధ్యక్షతన లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశమై రాకెట్‌ ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రాకెట్‌ ద్వారా డీఆర్‌డీవో రూపొందించిన 436 కేజీల ఈఎంఐ శాటిలైట్‌ను నింగిలో 749 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 98 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టబోతున్నారు. ఇది దేశ రక్షణ రంగానికి ఉపయోగపడనుంది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం 6గంటల 27నిమిషాలకు ప్రారంభించారు.

ఈ ప్రయోగం మూడు గంటలకు పైగా జరగనుంది. రాడార్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఇస్రో ఈ ప్రయోగం చేస్తుంది. మొదట మన దేశానికి చెందిన ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చిన అనంతరం మిగిలిన విదేశీ ఉపగ్రహాలను ఒకదాని తరువాత ఒకటి కక్ష్యలోకి పంపనున్నారు. అమెరికాకు చెందిన 20 భూపరిశీలన నానో ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన రెండు, స్విట్జర్లాండ్‌, స్పెయిన్‌కు చెందిన ఉపగ్రహాలను రోదసీలో 504 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టబోతోంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆదివారం షార్‌కు చేరుకున్నారు.