పండుగలతో జాగ్రత్త : కరోనా పీక్ స్టేజ్ ని దాటేసిన భారత్….ఫిబ్రవరి నాటికి వైరస్ అంతం

  • Published By: venkaiahnaidu ,Published On : October 18, 2020 / 03:49 PM IST
పండుగలతో జాగ్రత్త : కరోనా పీక్ స్టేజ్ ని దాటేసిన భారత్….ఫిబ్రవరి నాటికి వైరస్ అంతం

Updated On : October 18, 2020 / 8:11 PM IST

Covid Peak Over, Can be Controlled Early Next Year కరోనా పీక్ స్టేజ్ ని భారత్ ఇప్పటికే దాటేసిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి దేశంలో మహమ్మారి కంట్రోల్ కి వస్తుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. కరోనా అంతమయ్యే 2021 ఫిబ్రవరి చివరి నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1కోటి 5లక్షల వరకు ఉండవచ్చని తెలిపింది. కాగా,ప్రస్తుతం దేశంలో 75లక్షల కరోనా కేసులు ఉన్న విషయం తెలిసిందే.



కానీ, శీతాకాలంలో మరియు రాబోయే పండుగల నేపథ్యంలో వైరస్ కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని, ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని,నిర్లక్ష్యం వహించరాదని కమిటీ సృష్టం చేసింది. మరోవైపు, భద్రతా చర్యలలో( safety measures) సడలింపు… గణనీయమైన కేసుల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది నెలకు 26 లక్షల కేసుల వరకు ఉంటుందని కమిటీ తెలిపింది. జనాభాలో 30 శాతం మందిలో మాత్రమే ఇప్పటివరకు రోగనిరోధక శక్తి(immunity)డెవలప్ అయినట్లు కమిటీ తెలిపింది. భద్రతాచర్యలు తప్పనిసరిగా కంటిన్యూ అవ్వాలని పేర్కొంది.

కేరళలో ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఓనం పండుగ సందర్భంగా ప్రజలు ఎక్కువగా గుమిగూడారని.. స్నేహితులు, బంధువులను ఎక్కువగా కలిశారని, ఆ తర్వాత కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని వివరించారు. నవరాత్రులు, దసరా, దీపావళి, క్రిస్ట్‌మస్ లాంటి పండుగలను కొవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని కమిటీ సూచించింది.



కాగా, శీతాకాలంలో భారత్‌లో రెండోవిడత కరోనా వైరస్‌ కేసుల ఉధృతి పెరిగే అవకాశం లేకపోలేదని నీతి ఆయోగ్‌ సభ్యులు వీకే పాల్‌ హెచ్చరించారు. వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తే దాన్ని పౌరులందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా అన్ని వనరులూ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మరోవైపు, దేశంలో కరోనా మరణాల సంఖ్య 1లక్షా 13వేలు దాటగా,వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 65 లక్షలుగా ఉంది.



భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ఇటీవల ప్రకటించారు. ఇతర దేశాల మాదిరిగానే భారత్‌ కూడా వ్యాక్సిన్‌ ప్రయత్నాల్లో నిమగ్నమైందని, మూడు దేశీ కోవిడ్‌-19 వ్యాక్సిన్ ‌లు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో రెండు దేశీయ కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి రావడం పక్కా అని ఆయన రెండు రోజుల క్రితం ప్రకటించారు.