Cyclone Fani : పశ్చిమబెంగాల్ వైపు ఫోని

ఫోని తుఫాను ఒడిశాలో బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, గాలుల ధాటికి 6గురు ప్రాణాలు కోల్పోయారు. గంటకు 80-125 కి.మీ. వేగంగా పెనుగాలులు, అతి భారీ వర్షాలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. పూరీ వద్ద మే 03వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తీరం దాటింది. పశ్చిమబెంగాల్‌వైపు తరలింది. అక్కడ కూడా ఫోని ప్రభావం చూపడం ప్రారంభమైంది
ఫోని తుఫాను బెంగాల్ దిశగా పయనిస్తోంది. కటక్, జైపూర్, భద్రక్, బాలసోర్ మీదుగా బెంగాల్‌లో ప్రవేశించనుంది. మే 03వ తేదీ శుక్రవారం సాయంత్రం నుంచి 8 జిల్లాలపై ఫోని ప్రభావం చూపిస్తోంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోల్‌కతా పశ్చిమ మిడ్నాపూర్, ఉత్తర 24 పరగణాలు, హౌరా, హుగ్లీ, ఝార్‌గ్రామ్, సుందర్‌బన్, జిల్లాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. తీరప్రాంతాలకు వెళ్లవద్దని సర్కారు పర్యాటకులను కోరింది. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచనలు చేసింది. మే 04వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు కోల్‌కతా విమానాశ్రయం మూసివేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌గా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. 48గంటల పాటు తన ర్యాలీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. 24X7 పాటు మానిటరింగ్ చేస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు సహకరించాలని, తీర ప్రాంతాల వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని మమత తెలిపారు.