ఆర్థిక మరణశిక్ష విధించారు…విజయ్ మాల్యా ఆవేదన

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా(FEO) ప్రకటించడం, తన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతివ్వడం ద్వారా ప్రత్యేక న్యాయస్థానం తనకు ‘ఆర్థిక మరణ శిక్ష’ విధించిందని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బాంబే హైకోర్టు ముందు వాపోయారు.
గతేడాది ఆగష్టులో తీసుకువచ్చిన పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల(FEO) యాక్ట్ ప్రొవిజన్లను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో మాల్యా వేసిన పిటిషన్ పై బుధవారం(ఏప్రిల్-24,2019) విచారణ జరిగింది. విచారణ సమయంలో మాల్యా తన తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ ద్వారా ఈ వ్యాఖ్యలను ధర్మాసనానికి విన్నవించారు.
‘నా రుణాలు,ఆ రుణాలపై వడ్డీలు పేరుకుపోతున్నాయి. రుణాలు తీర్చడానికి నా దగ్గర సరిపడా ఆస్తులున్నప్పటికీ ప్రభుత్వం ఆ ఆస్తులను అమ్మి అప్పుతీర్చడానికి అంగీకరించడం లేదు. నా ప్రాపర్టీల మీద నాకు అధికారం లేదు. ఇది నాకు ఆర్థిక మరణ శిక్ష విధించడం లాంటిది’ అని మాల్యా తెలిపారు. మాల్యా ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన విచారణను నిలిపివేయాలంటూ న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఎఫ్ఈఓ చట్టంలోని ప్రొవిజన్ల కింద మాల్యాను ప్రత్యేక న్యాయస్థానం ఎఫ్ఈఓగా ప్రకటించిన విషయం తెలిసిందే.
మాల్యా తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ బుధవారం కోర్టులో వాదనలు వినిపిస్తూ..ఎఫ్ఈఓ చట్టంలోని ప్రొవిజన్లు క్రూరమైనవన్నారు. ఈ చట్టాన్ని మాల్యా వంటి వ్యక్తుల కోసం సిద్ధం చేశారన్నారు. రూ. 100 కోట్లు అంతకంటే ఎక్కువ ఆస్తులను ఎగ్గొట్టిన ఎగవేతదారులను వెనక్కి తీసుకురావడానికి దీన్ని ఉపయోగిస్తారు’ అని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఎఫ్ఈఓ చట్టంలోని ప్రొవిజన్ల మీద మాల్యా చేసిన అభ్యర్థనపై స్పందించాలని అటార్నీ జనరల్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది.