ఫ్లిప్‌కార్ట్‌లో దొంగబ్బాయిలు : కాస్ట్‌లీ స్మార్ట్‌ ఫోన్స్ చోరీ!

  • Published By: veegamteam ,Published On : February 21, 2019 / 05:36 AM IST
ఫ్లిప్‌కార్ట్‌లో దొంగబ్బాయిలు : కాస్ట్‌లీ స్మార్ట్‌ ఫోన్స్ చోరీ!

ఢిల్లీ : ఖరీదైన స్మార్ట్ ఫోన్ల దొంగతనం ఢిల్లీ శివార్లలో కలకలం రేపింది. ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ లో భారీ దొంగతనం చోటుచేసుకుంది. ఢిల్లీ శివార్లలోని అలీపూర్ హబ్ లో 150 ఖరీదైన స్మార్ట్ ఫోన్లు చోరీకి గురయ్యాయని ఫ్లిప్ కార్ట్ కంపెనీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఫిబ్రవరి 19న దొంగతనం జరిగిందని గుర్తించి వెంటనే దొంగబ్బాయిలను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అలీపూర్ హబ్ నుంచి బిలాస్ పూర్ లోని గోదాముకు తరలించేటప్పుడు ఈ దొంగతనం జరిగిందని నిర్ధారించారు.
 

ఫ్లిప్ కార్ట్ లో పనిచేస్తు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించారు. పలు ట్రాన్స్ పోర్ట్ కంపెనీల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న వీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వారి దర్యాప్తులో తేలింది. ఈ ముఠాకు లీడర్ సంతోష్‌తో పాటు బ్రీజ్‌మోహన్‌, అఖిలేశ్‌, రంజిత్‌లు అరెస్ట్ చేసి వారి నుంచి 30 స్మార్ట్ ఫోన్లను రూ.2.5 లక్షలను  స్వాధీనం చేసుకున్నామని..మిగిలినవాటిని అమ్మేశారా..లేదా ఎక్కడన్నా దాచిపెట్టారా అనే విషయాన్ని విచారిస్తున్నామని  పోలీసులు తెలిపారు.  గతంలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ చోరీ కేసులో సంతోష్‌, బ్రీజ్‌ మోహన్‌లపై అక్కడి ఫర్సత్ గంజ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయిందని తెలిపారు.