బీజేపీ నేత తనపై చేసిన కామెంట్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ కన్నీరు

రాజకీయాలు మరీ ఇంతగా దిగజారడమేంటని ప్రశ్నించారు.

బీజేపీ నేత తనపై చేసిన కామెంట్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ కన్నీరు

CM Atishi

Updated On : January 6, 2025 / 4:27 PM IST

బీజేపీ నేత రమేశ్ బిధూరి తనపై చేసిన కామెంట్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ కన్నీరు పెట్టుకున్నారు. అతిశీ తన తండ్రిని మార్చేశారంటూ తాజాగా రమేశ్ బిధూరి వ్యాఖ్యానించారు. దీనిపై ఇవాళ అతిశీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయాలు మరీ ఇంతగా దిగజారడమేంటని ప్రశ్నించారు.

కల్కాజీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి రమేశ్ బిధురి పదేళ్లుగా ఎంపీగా ఉన్న సమయంలో ఆ ప్రాంతం కోసం ఏం చేశారో చూపించాలని అన్నారు. తన తండ్రి తన జీవితమంతా ఉపాధ్యాయుడిగా పనిచేశారని తెలిపారు. పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వేలాది మంది పిల్లలకు ఆయన చదువు చెప్పారని అన్నారు.

ఇప్పుడు తన తండ్రికి 80 ఏళ్లు అని, ఆరోగ్యం బాగోలేదని, ఆయన నడవలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. అటువంటి వ్యక్తి గురించి రమేశ్ బిధూరి దుర్భాషలాడారని అన్నారు. ఈ దేశంలో రాజకీయాలు ఇంత దిగజారిపోతాయని తాను ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్యానించారు.

కాగా, బిధూరి తాజాగా మాట్లాడుతూ.. మర్లెనాగా ఉన్న అతిశీ ఇప్పుడు సింగ్ అని, ఆమె తన తండ్రిని కూడా మార్చారని అన్నారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ లక్షణాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. అంతేగాక, 2001లో పార్లమెంటుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు క్షమాబిక్ష కోసం ఆమె తల్లిదండ్రులు అప్పట్లో క్షమాభిక్ష పిటిషన్‌ను సమర్పించారని అన్నారు.

భారత సైనికుల మరణానికి కారణమైన ఉగ్రవాది అఫ్జల్ గురు మరణశిక్షకు వ్యతిరేకంగా అతిశీ మర్లెనా తల్లిదండ్రులు క్షమాభిక్ష పిటిషన్‌ను సమర్పించారని విమర్శించారు. ఆ ఉగ్రవాది మరణానికి క్షమాపణ కోరిన వారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా అని ఢిల్లీ ప్రజలను అడిగారు. మరోవైపు, కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీపై కూడా రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే ప్రియాంక గాంధీ వాద్రా చెంపల్లా తన అసెంబ్లీ నియోజకవర్గంలోని రోడ్లను నున్నగా చేస్తానని బిధూరి చెప్పారు.

జవాన్లు వెళ్తున్న వ్యానును పేల్చేసిన మావోయిస్టులు.. 9 మంది మృతి