ఇలాగైనా తగ్గుతుందని : ఢిల్లీలో కాలుష్యం..నీటిని చల్లుతున్న ఫైర్ సర్వీసెస్

దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వీడడం లేదు. ప్రమాదకరస్థాయిలో పొల్యూషన్ ఉంటుడడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ రంగంలోకి దిగింది. 13 ప్రాంతాల్లో నీటిని చిలుకరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రోహిణి, ద్వారకా, ఓఖ్లా ఫేజ్ 2, పంజాబీ బాగ్, ఆనంద్ విహార్, వివేక్ విహార్, వజీర్ పూర్, జహంగీర్ పురి, ఆర్కేపురం, బవానా, నరేలా, ముండ్కా, మాయపురి ప్రాంతాల్లోని చెట్లు, రోడ్లపై నీటిని చిలుకరిస్తున్నారు.
ఇందుకు 20 ఫైర్ టెండర్లను ఉపయోగిస్తున్నట్లు అధికారి వెల్లడించారు. అక్టోబర్ నుంచి ప్రమాదకరస్థాయిలో కాలుష్యం వెదజల్లుతోంది. గాలిలో నాణ్యత క్షీణిస్తోంది. గాలి నాణ్యత ప్రమాదకరస్థాయిలో పడిపోతోందని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది.
పక్క రాష్ట్రాలైన హర్యాణ, పంజాబ్లలో పంటలు తగులబెట్టడం కారణంగా వస్తున్న పొగే దీనికి కారణమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడిస్తున్నారు. ఈ ఏడాది పంటల తగులబెట్టుడం వల్ల గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు అయిందని ఆయన తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడించారు. నవంబర్ 04వ తేదీ నుంచి సరి – బేసీ విధానం కొనసాగించిన సంగతి తెలిసిందే. తాజాగా..నీటిని చల్లడం ద్వారా కాలుష్యం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.