లగ్జరీ కార్లు అమ్ముతానంటూ టోకరా.. బెయిల్ తీసుకుని కోర్టుకు గైర్హాజరు

లగ్జరీ కార్లు, ఆస్తుల అమ్మకాల్లో మోసాలకు పాల్పడుతున్న జిమ్ ఓనర్ ను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్ నరంగ్ అనే వ్యక్తి ప్రజల నుంచి డబ్బులు తీసుకుని.. లగ్జరీ కార్లు, ఆస్తులు అమ్ముతానని చెప్పి మోసాలకు దిగుతున్నాడు. అవి అమ్మకపోగా తిరిగి డబ్బులు కూడా ఇవ్వకుండా మొహం చాటేస్తున్నాడు. అతని జల్సాల కోసం మాత్రమే డబ్బులు వాడుకుంటున్నాడు.
దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ లో ఉంటున్న నరంగ్‌ను ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. చిత్రరంజన్ పార్క్ లో ఉండే సునీల్ వర్మ నరంగ్ మీద 2018లో కేసు పెట్టాడు. తన నుంచి రూ.1.15కోట్లు తీసుకుని.. ఆరు లగ్జరీ కార్లు అమ్ముతానని చెప్పాడు. కానీ, కేవలం ఒకటి మాత్రమే అమ్మాడు. మిగిలిన డబ్బులను కూడా తిరిగి ఇవ్వలేదని కంప్లైంట్ చేశాడు.
ఈ కంప్లైంట్ ఆధారంగా.. అతణ్ని అరెస్టు చేసినప్పటికీ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ వచ్చాక కోర్టు వాయిదాలకు అటెండ్ అవడం మానేశాడు. దీంతో అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఆ విషయం తెలిసి పరారీలో ఉన్న అతణ్ని పోలీసులు పట్టుకున్నారు. అదే సమయంలో చాలా మంది కంప్లైంట్స్ చేయడం మొదలుపెట్టారు.
ఇన్వెస్టిగేషన్ లో అక్టోబర్ 23న రాహుల్ నరంగ్.. యూసఫ్ సరాయ్ ను కలిసేందుకు వెళ్తున్నట్లుగా తెలిసి పోలీసులు ట్రాప్ చేసి అతణ్ని పట్టుకున్నారు. స్పాట్ కు వచ్చిన వెంటనే అతడిని అరెస్టు చేశారు.