Atishi : ఢిల్లీ నూతన సీఎంగా అతిశీ మర్లెనా.. నాలుగేళ్లలో ఎమ్మెల్యే, మంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి!
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోయింది. అతిశీ ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అతిశీ పేరును ప్రతిపాదించారు.

Delhi New CM Atishi
Delhi New CM Atishi : ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోయింది. అతిశీ మర్లెనా ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అతిశీ పేరును ప్రతిపాదించారు. ఇందుకు ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపారు. అతిశీ పేరును సీఎంగా ప్రకటించిన తరువాత సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు. కేజ్రీవాల్ మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో మంత్రులతో భేటీ అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనాతో సమావేశం కానున్నారు. ఆ తరువాత తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. అదేవిధంగా.. నూతన సీఎంగా అతిశీ పేరును ప్రతిపాదిస్తూ పార్టీ ప్రతిపాదనను, ఎమ్మెల్యే మద్దతును తెలియజేనున్నారు.
Also Read : Delhi Politics: ఢిల్లీ రాజకీయాలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. కేజ్రీవాల్ నెక్స్ట్ ప్లాన్ అదేనా?
సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించిన రోజు నుంచి తరువాత ముఖ్యమంత్రిగా అతిశీ పేరు ప్రముఖంగా వినిపించింది. అతిశీ (43) సంవత్సరాలు. ప్రస్తుతం ఢిల్లీ ఎడ్యుకేషన్, పీడబ్ల్యూడీ వంటి కీలక శాఖల మంత్రిగా ఆమె ఉన్నారు. ఆమె ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆమె ఢిల్లీలోని పాఠశాలల్లో విద్య నాణ్యతను మరింత మెరుగుపరచడానికి కృషిచేశారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన కేసులో సిసోడియా అరెస్టయిన తర్వాత అతిశీ మంత్రి అయ్యారు. కేజ్రీవాల్, సిసోడియా జైలుకు వెళ్లిన సమయంలో ఆమె పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు.
కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ పేరు ఢిల్లీ సీఎం పదవి రేసులో ప్రముఖంగా వినిపించింది. ఆప్ ఎమ్మెల్యేలుసైతం సునీత కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని భావించారు. అందుకు మద్దతు తెలిపారు. దీంతో జాతీయ మీడియాసైతం సీఎం పదవి రేసులో సునీత కేజ్రీవాల్ పేరును ప్రముఖంగా ప్రస్తావించింది. కానీ, కేజ్రీవాల్ తో పాటు, సునీత కేజ్రీవాల్ సైతం సీఎం చైర్ లో కూర్చునేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.
నాలుగేళ్లలో ఎమ్మెల్యే, మంత్రి, సీఎం..
2019లో తూర్పు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన అతిశీ.. బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్ పై 4.77లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా అతిశీ ఎన్నికయ్యారు. 2023లో తొలిసారిగా కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఇప్పుడు కేవలం ఏడాది తరువాత 2024లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.