తీహార్ జైలుకి డీకే శివకుమార్

  • Published By: venkaiahnaidu ,Published On : September 17, 2019 / 04:19 PM IST
తీహార్ జైలుకి డీకే శివకుమార్

Updated On : September 17, 2019 / 4:19 PM IST

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి  డీ కే శివ కుమార్‌కు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు మంగళవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేందుకు మొదట ఆసుపత్రికి తీసుకెళ్ళాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలిపింది. డాక్టర్లు ఆయనకు ట్రీట్మెంట్ అవసరమని చెప్తే, తదనుగుణంగా హాస్పిటల్ లో చేర్పించాలని, లేనిపక్షంలో ఆయనను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది.
 
కోర్టు ఆదేశాల ప్రకారం శివ కుమార్‌ 14 రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. అయితే ఆయనకు బెయిలు మంజూరు చేయాలని ఆయన తరపు వాదించిన అభిషేక్ మను సింఘ్వి కోరారు. సింఘ్వి మాట్లాడుతూ శివ కుమార్ ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరంగా ఉందని, ఆయనకు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని, అందువల్ల బెయిలు మంజూరు చేసి, విడుదల చేయాలని కోరారు. ఈ వాదనను స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ మన్నించలేదు.

ఈడీ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ కే ఎం నటరాజ్ మాట్లాడుతూ శివ కుమార్ ఆరోగ్య పరిస్థితుల వల్ల ఆయనను సమగ్రంగా ప్రశ్నించే అవకాశం ఈడీకి లభించలేదని చెప్పారు. మనీలాండరింగ్ కేసులో శివ కుమార్‌ను  ఈ నెల 3న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే