అర్ధరాత్రి ముంచుకొచ్చిన ఉపద్రవం.. 67మంది ప్రాణాలను కాపాడిన కుక్క.. అసలేం జరిగిందంటే?
కుక్క చేసిన పనితో 20 కుటుంబాలకు చెందిన 67 మంది ప్రాణాలతో బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు.

Dog
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే, మండి జిల్లాలోని ఓ కుక్క వరద విపత్తు నుంచి 67 మంది ప్రాణాలను కాపాడింది.
Also Read: Singareni Strike: సింగరేణిలో సమ్మె సైరన్.. బొగ్గు ఉత్పత్తికి బ్రేక్..! రూ.76 కోట్లు నష్టం..!
జూన్ 30న అర్ధరాత్రి సమయంలో హిమాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతాలను క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తాయి. మండి జిల్లా ధరంపూర్ ప్రాంతంలోని సియాతి గ్రామం కూడా వరదలకు తీవ్ర ప్రభావితమైంది. అర్ధరాత్రి వరదలు ముంచెత్తడంతో అందరూ నిద్రలో ఉన్నారు. అదేగ్రామంలోని నరేంద్ర అనే వ్యక్తి ఇంట్లోని కుక్క బిగ్గరగా మొరగడం ప్రారంభించింది. దీంతో నరేంద్ర నిద్రలేచాడు. కుక్క దగ్గరికి వెళ్లేసరికి ఇంటి గోడలో పెద్ద పగుళ్లు కనిపించాయి. నీరు లోపలికి రావడం ప్రారంభమైంది. వెంటనే అతను కుక్కతోపాటు కిందకు పరిగెత్తి అందరినీ నిద్రలేపాడు. ఆ తరువాత అందరూ అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు.
ఆ సమయంలో భారీ వర్షం పడుతుంది. ప్రజలంతా బయటకు వచ్చిన తరువాత కొద్దిసేపటికే గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు డజనుకుపైగా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. గ్రామంలో నాలుగైదు ఇళ్లు మాత్రమే కనిపిస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
కుక్క కారణంగా 20 కుటుంబాలకు చెందిన 67 మంది ప్రాణాలతో బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రాణాలతో బయటపడినవారంతా గత ఏడు రోజులుగా త్రియంబాల గ్రామంలో నిర్మించిన ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ విషాదం తరువాత వారికి ఇతర ప్రాంతాల ప్రజలు సహాయం అందించారు. ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది.
హిమాచల్ ప్రదేశ్ లో జూన్ 20 నుంచి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా 78మందికిపైగా మరణించారు. వీరిలో 50 మంది కొండచరియలు విరిగిపడటం వల్ల మరణించారు.