కాపీ-పేస్ట్ చేయొద్దు…డీకే కేసులో ఈడీ పిటిషన్ కొట్టేసిన సుప్రీం

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఇవాళ(నవంబర్-15,2019) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో ఆయనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టేసింది. మాజీ కేంద్రమంత్రి చిదంబరం కేసులో వాదననే ఎలాంటి మార్పులు చేయకుండా అచ్చుగుద్దినట్టు ఈ కేసులోనూ వినిపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఆదాయ పన్ను శాఖ తనపై మోపిన అభియోగాలను కొట్టేయాలంటూ శివకుమార్ పెట్టుకున్న అభ్యర్థనపైనా సుప్రీం స్పందించింది. ఆయన పిటిషన్‌పై ఐటీ శాఖకు నోటీసులు జారీ చేసింది. కాగా మనీలాండరింగ్ కేసులో డీకేకు అక్టోబర్ 23న ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఈ కేసులో ఆధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బెయిల్ రద్దు చేయాలంటూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విసయం తెలిసిందే.