కేరళ RGCBకి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ‘గోల్వాల్కర్’ పేరు…కేంద్రానికి సీఎం విజయన్ లేఖ

  • Published By: venkaiahnaidu ,Published On : December 6, 2020 / 04:47 PM IST
కేరళ RGCBకి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ‘గోల్వాల్కర్’ పేరు…కేంద్రానికి సీఎం విజయన్ లేఖ

Updated On : December 6, 2020 / 5:09 PM IST

Kerala Chief Minister To Centre తిరువనంతపురంలోని రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ(RGCB)రెండో ప్రాంగణానికి దివంగత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త “ఎం.ఎస్ గోల్వాల్కర్​” పేరు పెట్టాలని నిర్ణయించినట్లు శుక్రవారం(డిసెంబర్-4,2020)కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్థన్ ప్రకటించిన విషయం తెలిసిందే.



రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీని “శ్రీ గురూజీ మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లెక్ డిసీజ్ ఇన్ కాన్సర్ అండ్ వైరల్ ఇన్పెక్షన్”గా పేరు మార్చనున్నట్లు హర్షవర్థన్ ప్రకటించారు. డిసెంబర్-22నుంచి 25వరకు జరగనున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఫ్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ శుక్రవారం హర్షవర్థన్ ఈ వ్యాఖ్యలు చేశారు.



అయితే, కేంద్రమంత్రి ప్రకటనని కేరళ అధికార వామపక్ష, ప్రతిపక్ష కాంగ్రెస్​ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విజ్ఞానశాస్త్రానికి గోల్వాల్కర్‌ ఏం చేశారని ప్రశ్నించాయి. ప్రతి విషయాన్ని బీజేపీ మతపరం చేస్తోందని ఆరోపించాయి. కేంద్రం నిర్ణయాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ వరుస ట్వీట్లు చేశారు



ఈ నేపథ్యంలో ఆదివారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌.. కేంద్రమంత్రి డా.హర్షవర్ధన్‌ కు లేఖ రాశారు. RGCBని మొదట రాష్ట్ర ప్రభుత్వం నడిపిందని, అయితే,పరిశోధన మరియు అభివృద్ధిలో అంతర్జాతీయ ప్రమాణాలను సాధించే కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో RGCBని భారత ప్రభుత్వానికి అప్పగించినట్లు విజయన్ లేఖలో పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రతిపాదిత పేరుకు బదులుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కొంతమంది ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తల పేరుతో ఈ ప్రాంగణానికి పేరు పెట్టాలని కేరళ ప్రభుత్వం అభిప్రాయపడిందని విజయన్ తన లేఖలో తెలిపారు.



ఆర్‌జీసీబీకి గోల్వాల్కర్‌ పేరు పెట్టాలన్న నిర్ణయంపై పునరాలోచించాలని సీఎం విజయన్ తన లేఖలో కోరారు. ఆర్‌జీసీబీ రాజకీయాలకు అతీతమని లేఖలో సీఎం విజయన్ పేర్కొన్నారు.