Arvind Kejriwal: ఓ నకిలీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీని త్వరలో అరెస్ట్ చేస్తారు: కేజ్రీవాల్
ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

బీజేపీపై ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలు ఆరోపణలు చేశారు. ఓ నకిలీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీని త్వరలో అరెస్ట్ చేస్తారని కేజ్రీవాల్ అన్నారు. ఇవాళ ఢిల్లీలో అతిశీతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఇటీవల ఈడీ, సీబీఐ, ఆదాయ పన్ను శాఖ సమావేశం నిర్వహించాయని, అతిశీని అరెస్టు చేయడానికి, ఆప్ సీనియర్ నాయకుల ఇళ్లపై రైడ్స్ చేయడానికి పై నుంచి వారికి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. ఫేక్ ట్రాన్స్‌పోర్ట్ కేసులో అతిశీని అరెస్టు చేస్తారని తెలిపారు. మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి సంక్షేమ కార్యక్రమాలను పార్టీ ప్రకటించడంతో బీజేపీ ఉలిక్కిపడిందని అన్నారు.
ఆప్‌ను ఎన్నికల ప్రచారం నుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన నకిలీ కేసులో అతిశీని అరెస్టు చేయవచ్చని తెలిపారు.
తాను బతికున్నంత వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్నిఆపబోనని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి.