నేడే ఎన్నికలకు ముహుర్తం: జనవరిలో రాజధాని సమరం.. ప్రచారం ప్రారంభం

  • Published By: vamsi ,Published On : December 26, 2019 / 07:25 AM IST
నేడే ఎన్నికలకు ముహుర్తం: జనవరిలో రాజధాని సమరం.. ప్రచారం ప్రారంభం

Updated On : December 26, 2019 / 7:25 AM IST

దేశ రాజధాని నగరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల తేదీలపై నిర్ణయం  తీసుకోవడానికి ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు ఢిల్లీలో ఇవాళ(26 డిసెంబర్ 2019) సమావేశం అయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తుండడంతో ఈలోపే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది ఎన్నికల సంఘం. దీంతో జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. 

ఢిల్లీలో జరుగుతున్న కీలక భేటీలో ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) సునీల్ అరోరా, ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) డాక్టర్ రణ్‌బీర్ సింగ్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సహా మరికొందరు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో అధికార పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ‘‘అచ్చే బీతే 5 సాల్, లగే రహో కేజ్రీవాల్’’ (గత ఐదేళ్లూ బావుంది.. కేజ్రీవాల్‌నే కొనసాగించండి..) అంటూ ఆప్ నేతలు ప్రచారం చే0స్తున్నారు.

మరోవైపు బీజేపీ సైతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో రాంలీలా మైదానంలో భారీ ర్యాలీతో ప్రచారం ప్రారంభించింది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు గానూ 67 స్థానాలకు పైగా విజయం సాధించాలని ఆప్ లక్ష్యంగా పెట్టుకోగా.. ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో విజయం సాధించగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మిగిలిన మూడు సీట్లలో గెలిచింది.