Paneer Production : పనీర్ తయారీతో పాడి రైతులకు అదనపు ఆదాయం

పనీర్ తయారీని కొంత మంది రైతు సంఘాలుగా ఏర్పడి కుటీర పరిశ్రమగా నిర్వహించుకోవచ్చు. పనీర్ అనేది పాల నుండి ప్రోటీన్లు, కొవ్వు వేరుచేసి గడ్డకట్టించడం ద్వారా తయారు చేయబడుతుంది.

Paneer Production : పనీర్ తయారీతో పాడి రైతులకు అదనపు ఆదాయం

Paneer

Updated On : December 13, 2021 / 4:44 PM IST

Paneer Production : పశుపోషణ లాభదాయకమే కానీ పాల ఆధారిత ఉత్పత్తులు తయారుచేసి విక్రయిస్తే రెట్టింపు లాభాలను పాడి రైతులు సమకూర్చు కోవచ్చు. పాల కంటే దాని నుండి తయారైన ఉప ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో పాడి రైతులు ప్రస్తుతం వాటి వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విధానాన్ని జనగాం జిల్లాలో అనేక మంది పాడి రైతులు అనుసరిస్తున్నారు. వారే సొంతంగా పనీర్‌ తయారుచేసి హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. బచ్చన్నపేట మండలం పోచన్నపేట, ఇటుకాలపల్లి పాడి రైతులు. ఈమండలం ఎత్తయిన ప్రాంతంలో వుండటం, వర్షపాతం తక్కువగా వుండటంతో రైతులకు వర్షాధార పంటలే శరణ్యం.  దాంతో తక్కువ నీరు సరిపోయే పాడి పరిశ్రమ వైపు ఈ ప్రాంత రైతులు దృష్టి పెట్టారు. పాలను తక్కువ ధరకు ఎవరికో అమ్ముకునే కంటే పాల ఆధారిత ఉత్పత్తులను తయారుచేసి, వాటిని విక్రయిస్తే అధిక లాభాలు వస్తాయని ఆలోచించారు. ప్రస్తుతం ఇదే పందాను ఇతర రైతులు అనుసరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

పనీర్‌ తయారీ ఇలా..
పనీర్ తయారీని కొంత మంది రైతు సంఘాలుగా ఏర్పడి కుటీర పరిశ్రమగా నిర్వహించుకోవచ్చు. పనీర్ అనేది పాల నుండి ప్రోటీన్లు, కొవ్వు వేరుచేసి గడ్డకట్టించడం ద్వారా తయారు చేయబడుతుంది. రైతుల వద్ద నుంచి సేకరించిన పాలను 50 లీటర్ల చొప్పున గిన్నెల్లో పోసి కట్టెల పొయ్యి మీద 85 డిగ్రీల సెల్సియస్‌ వరకు కాగేలా మరుగబెడతారు. అనంతరం ప్లాస్టిక్‌ డబ్బాలో పోస్తారు. ఇందులో 100 ఎం.ఎల్‌ వెనిగర్‌ను కలిపి కలియబెడతారు. దీంతో జున్నుగడ్డలా పనీర్‌ మిశ్రమం తయారవుతుంది. పనీర్‌ గడ్డను బట్టలో మూటగట్టి బరువు పెడతారు. రెండు నుంచి మూడు గంటలు అలా ఉంచి ప్లాస్టిక్‌ సంచుల్లో వేసి అమ్మకాలు సాగించవచ్చు. సాధారణ వెన్న శాతం కలిగిన ఆరు లీటర్ల ఆవుపాలకు కిలో పనీర్‌ వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో హోల్‌సేల్‌గా కిలోకు రూ.200 నుంచి రూ.250 వరకు విక్రయించవచ్చు. రిటైలర్లు 200 గ్రాముల నుంచి 5 కిలోల వరకు ఆకర్షణీయమైన కవర్లలో ప్యాక్‌ చేసి మూడు రెట్ల అధిక ధరకు మార్కెట్‌లో విక్రయించటం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు.

ప్రభుత్వ ప్రోత్సాహం..
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పాడి రైతులకు తగి ప్రోత్సాహం అందిస్తే పాడి ఉప ఉత్పత్తుల తయారీ ఊపందుకుంటుంది. తద్వారా రైతులకు మరింత ఆదాయం సమకూరుతుంది. ప్రతి జిల్లాకు ఒక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు ఆలోచించాలని రైతులు సూచిస్తున్నారు. అదేక్రమంలో డ్వాక్రా వంటి స్వయం సహాయక సంఘాలు తాము సేకరించిన పాలను ప్రాసెసింగ్‌ చేసి పెరుగు, పన్నీర్‌, ఛీజ్‌, నెయ్యితోపాటు ఐస్‌ క్రీం తయారు చేయవచ్చు. తమ పాల ఉత్పత్తులను సొంతబ్రాండ్‌తో మార్కెట్‌లో అమ్ముకాలు జరిపి లాభాలు గడించే అవకాశం ఉంది. మహిళా సంఘాలకు అవసరమైన పెట్టుబడులు అందించేందుకు బ్యాంకులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.