ఎస్‌బీఐ నకిలీ బ్రాంచును ఏర్పాటుచేసి మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లు 

కొత్తగా చేరిన ఉద్యోగులు కూడా దాన్ని నిజమైన బ్యాంక్‌గానే భావించి, మంచి జాబ్ దొరికిందని సంబర పడిపోయారు.

ఎస్‌బీఐ నకిలీ బ్రాంచును ఏర్పాటుచేసి మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లు 

Updated On : October 3, 2024 / 2:42 PM IST

Fake SBI Branch: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) నకిలీ బ్రాంచును ఏర్పాటుచేసి, లక్షలాది రూపాయలు దోచుకున్నారు కేటుగాళ్లు. సినిమా రేంజ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంత పెద్ద మోసం జరుగుతున్నా 10 రోజుల వరకు ఎవరూ పసిగట్టలేకపోయారు. అక్రమ అపాయింట్‌మెంట్‌, నకిలీ ట్రైనింగ్ సెషన్లను నిర్వహిస్తూ ఆ కేటుగాళ్లు ఓ పథకం పేరిట మోసాలకు పాల్పడ్డారు.

ఆ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉండే శక్తి జిల్లాలోని ఛపొరా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ బ్యాంకు నకిలీ బ్రాంచును పదిరోజుల క్రితమే ఏర్పాటు చేశారు. నిజమైన బ్యాంకులా కేటుగాళ్లు పోజులు కొట్టారు. కొత్త ఫర్నిచర్లు, ప్రొఫెషనల్‌గా ఉండే పేపర్లు, బ్యాంకు కౌంటర్లను ఏర్పాటు చేసి ఏ మాత్రం అనుమానం రాకుండా అందరినీ మేనేజ్‌ చేశారు. అది నకిలీ బ్రాంచ్ అని తెలియక ఆ గ్రామస్థులు ఆ బ్యాంకులో ఖాతాలు తెరిచేందుకు క్యూ కట్టారు.

కొత్తగా చేరిన ఉద్యోగులు కూడా దాన్ని నిజమైన బ్యాంక్‌గానే భావించి, మంచి జాబ్ దొరికిందని సంబర పడిపోయారు. తాజాగా, ఎస్‌బీఐ అధికారులకు ఆ బ్యాంకు బ్రాంచ్‌పై అనుమానం వచ్చి, ఆరా తీయగా నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చి కొందరిని ఉద్యోగాల్లో చేర్చుకున్నట్లు తేలింది. దీంతో డాబ్రా ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు కేటుగాల్లు కలిసి ఈ స్కామ్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రేఖా సాహు, మందిర్ దాస్, పంకజ్ అనే ముగ్గురితో పాటు మరొకరిపై కేసు నమోదు చేశారు.

KA Paul: కొండా సురేఖ వ్యాఖ్యలపై కేఏ పాల్ ఫైర్.. కేసీఆర్, కేటీఆర్ గురించి ఏమన్నారంటే?