ఆ పేద తండ్రి కొడుకు చదువు కోసం ఇంటిని కూడా అమ్ముకున్నాడు, సివిల్స్‌లో 26వ ర్యాంకు సాధించిన కుర్రాడు

  • Published By: naveen ,Published On : August 6, 2020 / 08:41 AM IST
ఆ పేద తండ్రి కొడుకు చదువు కోసం ఇంటిని కూడా అమ్ముకున్నాడు, సివిల్స్‌లో 26వ ర్యాంకు సాధించిన కుర్రాడు

Updated On : August 6, 2020 / 12:36 PM IST

ఆ కుర్రాడిది నిరుపేద కుటుంబం. తీవ్రమైన ఆర్థిక సమస్యలు. కానీ ఇవేవీ అతడి లక్ష్యాన్ని, కలను అడ్డుకోలేదు. కష్టపడి మరింత పట్టుదలతో చదివాడు. తన చదువు ఖర్చుల కోసం ఇంటి కూడా అమ్ముకున్న ఆ తండ్రి నమ్మకాన్ని నిలబెట్టాడు. యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఏకంగా 26వ ర్యాంకు సాధించాడు. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఆ కుర్రాడి పేరు ప్రదీప్ సింగ్.



ఇండోర్ కి చెందిన ప్రదీప్ సింగ్ సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటాడు. ఐఏఎస్ కావాలన్నది ప్రదీప్ లక్ష్యం. సివిల్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2019లో జాతీయ స్థాయిలో 26వ ర్యాంకు సాధించాడు. యూపీఎస్సీ మంగళవారం ఫలితాలను విడుదల చేసింది. 829 మంది ఐఏస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ కు అర్హత సాధించారు.

pradeep singh upsc result 2020



”2018లో నేను తొలి ప్రయత్నంలోనే 93వ ర్యాంకు సాధించాను. కానీ ఐఏఎస్ కి సెలెక్ట్ కాలేకపోయాను. దీంతో ఈసారి మరింత కష్టపడి చదివాను” అని 23ఏళ్ల ప్రదీప్ సింగ్ చెప్పాడు. ప్రదీప్ సింగ్ తండ్రి ఓ పెట్రోల్ బంకులో పని చేస్తాడు. 28ఏళ్ల పాటు బంకులోనే పని చేశాడు. గత ఏడాది చిన్న స్థాయిలో ట్రాన్స్ పోర్టు వ్యాపారం ప్రారంభించాడు.

2018లో సాధించిన ర్యాంకు ఆధారంగా ప్రదీప్ సింగ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కి సెలెక్ట్ అయ్యాడు. నాగ్ పూర్ లోని నేషనల్ డైరెక్ట్ ట్యాక్సెస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నాడు. అయితే ప్రదీప్ సింగ్ లీవ్ తీసుకున్నాడు. ఐఏఎస్ లక్ష్యంగా మరోసారి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. అనుకున్నది సాధించాడు.



”కాలేజీ చదువు వరకు నా జీవితం అంతా పోరాటమే. మా నాన్న పెట్రోల్ బంకులో పని చేసేవాడు. చాలా తక్కువ జీతం వచ్చేది. ఇల్లు గడవటమే కష్టంగా ఉండేది. ఇవన్నీ నేను బాగా గమనించాను. ఆ పరిస్థితులు నన్ను మరింత రాటుదేల్చాయి. మరింత కష్టపడి చదవాలని నిర్ణయించుకున్నా. ఐఏఎస్ కావాలని 7వ తరగతిలోనే లక్ష్యంగా పెట్టుకున్నా. నన్ను నేను ధైర్య పరుచుకున్నా. నా లక్ష్యాన్ని సాధించడానికి మరింత కష్టపడ్డా” అని ప్రదీప్ సింగ్ చెప్పాడు.

ప్రదీప్ సింగ్ తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు. నా కొడుకు మా అందరిని గర్వపడేలా చేశాడని ప్రదీప్ తండ్రి మనోజ్ సింగ్ చెప్పాడు. మహా కాళేశ్వరుడి దయవల్ల నా కొడుకు ఐఏఎస్ అయ్యాడు అని మనోజ్ సింగ్ అన్నాడు. కాగా, కొడుకు చదువు ఖర్చుల కోసం తండ్రి మనోజ్ సింగ్ ఇంటిని కూడా అమ్మేశాడు. ఆ తర్వాత కొడుకు పై చదువుల కోసం ఢిల్లీకి వెళ్లిపోయారు. తమ దగ్గర డబ్బు లేకపోయినా కొడుకు చదువుకి ఇబ్బందులు రాకుండా తల్లిదండ్రులు చూసుకున్నారు. చాలా త్యాగాలు చేశారు. సొంత ఇంటిని అమ్మి అద్దె ఇంట్లోకి వెళ్లారు. ఇక తన తల్లిదండ్రులు కష్టాలు పడకుండా చూసుకుంటానని, వారికి మంచి జీవితం ఇవ్వాలని అనుకుంటున్నా అని ప్రదీప్ సింగ్ చెప్పాడు.

పేదరికం చదువుకి అడ్డు కాదని 23ఏళ్ల కుర్రాడు నిరూపించాడు. కృషి, పట్టుదల, శ్రమ, కసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చూపించాడు. ఏవో కారణాలు చూపించి అందుకే చదువుకోలేకపోయాము అని సాకులు చెప్పేవారికి ప్రదీప్ సింగ్ ఆదర్శంగా నిలిచాడు. అంతేకాదు తనపై తల్లిదండ్రుల ఉంచిన నమ్మకాన్ని కూడా నిలబెట్టాడు. తన చదువు కోసం సర్వస్వం వదులుకున్న ఆ తండ్రి కష్టాన్ని వృథాకానివ్వ లేదు.