విమానంలో వలసకూలీలను పంపించిన రైతు: ప్రభుత్వాలు చేయలేనిపని చేసి చూపించాడు

తన దగ్గర పనిచేసే కూలీలను వారి సొంత ఊర్లకు పంపించటానకి ఓ రైతు వారి కోసం ఏకంగా విమానం టిక్కెట్లు బుక్ చేశాడు. ఆ రైతు పేరు పప్పన్ సింగ్. బీహార్ నుంచి ఢిల్లీకి వలస వచ్చి…తన దగ్గర పనిచేస్తున్న కూలీలను విమానంలో పంపించాడు ఢిల్లీ సమీపంలోని తిగిపూర్ గ్రామానికి చెందిన పుట్టగొడుగుల రైతు పప్పన్ సింగ్.
లాక్ డౌన్ లో పనులు నిలిచిపోవటంతో పప్పన్ సింగ్ తన కూలీల మనస్సుని అర్థం చేసుకున్నాడు. పనులు చేయకపోయినా వారికి భోజనం పెట్టాడు. ఆకలి అనే మాటే లేకుండా ఆదుకున్నాడు పప్పన్ సింగ్. రైతు అంటే పంటలు పండించటమే కాదు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే రియల్ హీరో అనిపించుకున్నాడు.
రైతు కూలీ కష్టమేంటో రైతుకే తెలుసు. వ్యవసాయం చేసి ప్రజల కడుపులు నింపే రైతన్న కూలీల కష్టాన్ని కూడా అంతే ఆదరంగా చూశాడు పప్పన్. తన వద్ద పనిచేస్తున్న 10 మంది కూలీలను స్వస్థలాలకు పంపించడానికి రూ.70 వేలు ఖర్చెపెట్టి విమానం టిక్కెట్లు బుక్ చేశాడు.
కాగా..కూలీలు అప్పటికే శ్రామిక్ రైళ్లలో బుక్ చేసుకున్నారు.కానీ ఈ మండే వేసవి ఎండల్లో ప్రయాణిస్తున్న ఎంతోమంది కూలీలు దారిలోనే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులను గమనించిన పప్పన్ ఆ ప్రయాణం ప్రమాదకరమని భావించి వారిని విమానంలో పంపిస్తే క్షేమంగా వెళతారని ఈ నిర్ణయం తీసుకున్నాడు.
లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న కూలీలను పప్పన్ సింగ్ రెండు నెలల నుంచీ తన స్వంత మనుష్యుల్లా చూసుకున్నాడు.వారికి ఆశ్రయం కల్పించి, కడుపు నిండా భోజనం పెట్టించాడు. కానీ పనిచేయకుండా ఇలా..ఎంత కాలం ఉండగలం అని అనుకున్న ఆ బడుగు జీవులు సొంత ఊర్లకు వెళదామని అనుకున్నారు. అది తెలిసిన పప్పన్ బిహార్‌లోని వారి స్వస్థలాలకు పంపించడానికి విమాన టిక్కెట్లు బుక్ చేయించి ఇచ్చాడు. అంతేకాదు..బీహార్ లోని పాట్నా విమానాశ్రయంలో వారి దిగాక కూడా వారు ఇబ్బంది పడకూడదనుకున్నాడు. దీంతో పాట్నా ఎయిర్ పోర్ట్ నుంచి సహర్సా జిల్లాలోని వాళ్ల సొంతూరుకు బస్సును కూడా బుక్ చేశాడు.
దీనిపై పప్పన్ సింగ్ మాట్లాడుతూ..‘వాళ్లందరూ (కూలీలు) నా పనిచేశారు..మరి వాళ్లు కష్టంలో ఉంటే ఎలా వదిలేయగలను? నా సొంత మనుషుల లాంటి వారు. వాళ్లను నేను భోజనం పెట్టినా సరే.. తమ సొంతూర్లకు వెళ్లాలనుకున్నారు. కూలి పని చేసినా..ఆత్మాభిమానం కలవారు..అటువంటివారిని ఎలా వదిలేస్తాను? అని అన్నాడు. వాళ్లు వెళ్లే ప్రయాణంలో ఏదైనా జరగకూడనిది జరిగితే..దానికి నేను జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఎండలు మండిపోతున్నాయి..ఎంతోమంది ఈ ఎండలకు నానా ఇబ్బందులు పడుతున్నారు..కొంతమంది ప్రాణాల్ని కూడా కోల్పోతున్నారు.
ఈ మండుటెండల్లో రైలు ప్రయాణం కూడా వారికి ఏమాత్రం మంచిది కాదని అనుకున్నాడు. అందుకే వారిని సురక్షితంగా వారి స్వస్థలాలకు పంపించాల్సిన బాధ్యతగా భావించి..ఈ నిర్ణయం తీసుకున్నా. విమానం అయితే వారిని సురక్షితంగా గమ్యం చేరుస్తుందని భావిస్తున్నా..’ అని పప్పన్ సింగ్ తెలిపారు.
కాగా..కూలీల కోసం పప్పన్ సింగ్ టికెట్లు బుక్ చేసిన విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం అంటే ఈరోజే (మే 28,2020) ఉదయం 6 గంటలకు పాట్నా బయల్దేరి వెళ్ళింది. పప్పన్ సింగ్ వాళ్లందరికీ దగ్గరుండి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించాడు. విమాన ప్రయాణానికి అవసరమైన పేపర్స్ అన్నింటినీ వారికి అందజేశాడు.
రైతు పప్పన్ సింగ్ తమపట్ల చూపిస్తున్న ఆదరణకు వలస కూలీలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.ఇప్పటి వరకూ తాము పనిచేసి రైతు నుంచి డబ్బులు మాత్రమే తీసుకుంటువారంతా తమ పట్ల ఆ రైతు చూపించే ఆదరానికి కదిలిపోయారు. కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఓ కూలీ మాట్లాడుతూ..‘నేను నా జీవితంలో విమానం ఎక్కుతానని అనుకోలేదు. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
తన వద్ద పనిచేస్తున్న ఆ కూలీల కోసం పప్పన్ సింగ్ అంత చేయడానికి కారణమేంంటే.. వారిలో కొంత మంది అతడి వద్ద 20ఏళ్లుగా..ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నారు. వ్యవసాయం ద్వారా తాను ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం పొందుతున్నానంటే.. అది ఆ కూలీల శ్రమకు ఫలితమేనని పప్పన్ సింగ్ నిజాయతీగా చెబుతున్నాడు. ఇన్ని రోజులు ఆ కూలీలు చేసిన సేవకు తాను ఇలా గౌరవం ఇస్తున్నానని..ఈ గౌరవాన్ని ఈ రకంగా చూపించాలనుకున్నాననీ..అది నా బాధ్యతగా భావించానని పప్పన్ సింగ్ చెప్పడం అతడి మంచి మనసును తెలియజేస్తోంది.
Read: జయలలిత ఆస్తులు వారికే.. హైకోర్టు కీలక తీర్పు.. విలువ ఎంతంటే?