కదం తొక్కుతున్న రైతులు : ట్రాక్టర్లతో ర్యాలీ, ఢిల్లీ – జైపూర్ రోడ్డు దిగ్భందం

Farmers on strike : అన్నదాతలు తమ ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని డిసైడ్ అయ్యారు. 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం సింఘిలో నిరాహారీ దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈనెల 19లోగా కేంద్రం అ్రగి చట్టాలను రద్దు చేయకుంటే ఆమరణ నిరాహారదీక్షకు దిగాలని డిసైడ్ అయ్యారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా సోమవారం రాజస్థాన్ నుంచి రైతులు ట్రాక్టర్లతో ర్యాలీగా ఆదివారం ఢిల్లీకి చేరుకోనున్నారు. అంతేకాదు.. ఢిల్లీ – జైపూర్ రోడ్డును దిగ్బంధించనున్నారు.
మరోవైపు వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని మరోసారి స్పష్టం చేశారు ప్రధాన మంత్రి మోదీ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 17 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. సింఘు సరిహద్దులో నిరాహార దీక్షకు రైతులు రెడీ అయ్యారు. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే…. సోమవారం సింఘు సరిహద్దులో నిరాహార దీక్షకు దిగనున్నట్టు వెల్లడించారు. అంతేకాదు.. ఈనెల 19లోపు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దుచేయకపోతే… ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని రైతు సంఘాలు హెచ్చరించాయి. తమ పోరాటం శాంతియుతంగా కొనసాగుతోందని… దాన్ని హింసాత్మకంగా మార్చవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. కొత్త చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పాయి. రైతు సంఘాలను విడదీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించాయి.
ఢిల్లీ సరిహద్దుల్లో 17వ రోజైన శనివారం కూడా రైతులు ఆందోళన కొనసాగించారు. ఢిల్లీ, యూపీ, హర్యానా సరిహద్దుల్లోని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్దకు రైతులు భారీగా తరలివచ్చారు. టోల్ ప్లాజాల వద్దే తిష్ట వేశారు. పలు టోల్ ప్లాజాల దగ్గర ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా వాహనాల రాకపోకలకు అనుమతించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొన్ని టోల్ ప్లాజాలు మూసివేసేందుకు రైతులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో కొందరు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూతన చట్టాల సవరణకు ఒప్పుకునేది లేదని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు సంఘాలు తేల్చి చెప్పాయి. ఆలు, చెరకు, కూరగాయలు, పాలు సహా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరపై చట్టం తేవాలని రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు లాభదాయకమన్నారు ప్రధాని మోదీ. కొత్త చట్టాలతో రైతులు తమ పంట ఉత్పత్తుల్ని మండీల్లో లేదా బయట ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. భవిష్యత్తులో వ్యవసాయరంగంలో పెట్టుబడులు పెరిగి రైతులకు లబ్ది చేకూరుతుందని చెప్పారు. వర్షం కురిసినా… గడ్డకట్టే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలు ఉపసంహరించే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు.