ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోళన.. వారి డిమాండ్లలో ఇది సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం

Farmers protest: లాఠీఛార్జ్ చేసినా వెనక్కితగ్గబోమని... పోరాటాలు చేస్తామని రైతులు తెలిపారు.

ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోళన.. వారి డిమాండ్లలో ఇది సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం

Farmers Protest

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గబోమని రైతులు అంటున్నారు. ఇవాళ రైతులతో కేంద్ర ప్రభుత్వం మూడో విడత చర్చలు జరపనుంది.

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే రెండో విడత పాలనలో…రెండోసారి అన్నదాతలు చలో ఢిల్లీ అనడం వెనక ఉన్న డిమాండ్లు ఏంటి..? వ్యవసాయ చట్టాల రద్దు సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలయ్యాయా…? బుట్టదాఖలయ్యాయా..? రైతుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరేంటి..? కనీస మద్దతు ధరపై కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలవుతుందా? గత యూపీఏ పాలనకు, ఇప్పటికి కాంగ్రెస్ వైఖరిలో వచ్చిన మార్పు నమ్మదగినదేనా..?

సరిగ్గా ఎన్నికలకు ముందు రైతులు ఆందోళనకు దిగడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వమే నెరవేర్చాలన్నది అన్నదాతల వాదన. సంయుక్త కిసాన్ మోర్చా -రాజకీయేతర విభాగం ఆధ్వర్యంలో తాజా ఆందోళనలు జరుగుతున్నాయి.

కనీస మద్దతు ధర హామీకి చట్టబద్ధత, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు , పంట రుణాల మాఫీ, రైతులు-రైతుకూలీలకు పెన్షన్లు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, ఉపాధి హామీ పని దినాలు 200 రోజులకు పెంపు, 2020-21లో ఉద్యమంలో రైతులపై పెట్టిన కేసుల్ని కొట్టివేయడం, లఖింపూరిఖేరి బాధ్యులను శిక్షించడం, రైతు ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, పరిహారం, నకిలీ విత్తనాలు, మందుల తయారీదారులపై కఠిన చర్యలు మిర్చి, పసుపు, సుగంధ పంటలకు జాతీయ కమిషన్‌ ఏర్పాటు, ఆదివాసీల హక్కులు, అటవీ భూముల రక్షణ రైతుల డిమాండ్‌లుగా ఉన్నాయి.

ఇది సాధ్యం కాదని..
వీటనన్నింటిలో కనీస మద్దతు ధర హామీకి చట్టబద్ధతపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇది సాధ్యం కాదని కేంద్రం తేల్చేసింది. మిగిలినవాటిపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని అంటోంది. రైతుల సమస్యలు తీర్చడానికి కేంద్రం కట్టుబడి ఉందని రైతు సంఘాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్న కేంద్రమంత్రి అర్జున్‌ముండా చెప్పారు. సామాన్యులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

దేశంలో ఎక్కువమంది ఆధారపడి జీవిస్తున్న రంగం వ్యవసాయమే. అన్నదాత ఆందోళనల ప్రభావం అన్ని వర్గాలపై పడుతుంది. రైతుల డిమాండ్లకు కేంద్రం ఒప్పుకోకపోవడం, ఎన్నికల ముందు భారీ ఆందోళనకు అన్నదాతలు శ్రీకారం చుట్టడంతో అదను చూసి కాంగ్రెస్ రంగంలోకి దిగింది. రైతుల ఉద్యమానికి మద్దతు పలికింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై హామీ ఇచ్చింది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే…అమలుచేసే తొలి హామీ ఇదేనని ప్రకటించింది. రైతుల ఇతరసమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మల్లికార్జున ఖర్గే తెలిపారు. దీనిపై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఎమ్మెస్ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రధాన డిమాండ్ ఏంటి?
మార్కెట్ వ్యత్యాసాలతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర అమలుచేయాలన్నది రైతుల ప్రధాన డిమాండ్. దీనివల్ల వ్యవసాయం లాభసాటిగా మారకపోయినా భారీ నష్టాల నుంచి అన్నదాతలు తప్పించుకోవచ్చు. నిజానికిప్పుడు వ్యవసాయమనేది దేశంలో దండగమారివృత్తిలా మారింది.

వర్షాలు కురవకపోవడం, పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు ముంచెత్తడం, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు వంటివాటితో రైతులు అనేక కష్టనష్టాలు, వ్యయప్రయాసల మధ్య పంటసాగుచేస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు దాటుకుని సాగు కొనసాగించినా..చివరకు పంట చేతికొచ్చిన తర్వాత ధరలు అన్నదాతలను నిలువునా ముంచుతున్నాయి.

రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా దొరకడం లేదు. చివరకు అన్నదాతలు అప్పుల పాలయి, బలవన్మరణాలకు పాల్పడుతున్న దుస్థితి దశాబ్దాలుగా దేశంలో నెలకొంది. రైతుల బాధలన్నీ తీరడానికి ఏకైక పరిష్కారం చట్టబద్ధంగా కనీస మద్దతు ధర కల్పించడం అని…MS స్వామినాథన్ సహా వ్యవసాయరంగ నిపుణులు ఎందరో సూచిస్తూనే ఉన్నారు. అయితే ఏళ్లగా ఇది హామీ రూపంలో అక్కడక్కడా అమలువుతోందే కానీ చట్టం రూపంలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఇప్పుడు ఆందోళనలకు దిగిన అన్నదాతలు కోరుతోంది చట్టంరూపంలో దీన్ని అమలుచేయాలని.

23 రకాల పంటలకు కనీస మద్దతు ధర
ప్రస్తుతం వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న, సజ్జలు సహా 23 రకాల పంటలకు కనీస మద్దతు ధర అమలవుతోంది. ఇదిమరిన్ని పంటలకు విస్తరించాలన్నది అన్నదాతల డిమాండ్. కనీస మద్దతు ధర కన్నా తక్కువకు పంటలు కొనుగోలు చేయడాన్ని నేరంగా చూడాలని కూడా రైతన్నలంటున్నారు. అయితే కనీస మద్దతు ధర హామీకి చట్టబద్ధత కల్పించడం, అది అమలుచేయడంపై రకరకాల అభిప్రాయలు వినిపిస్తున్నాయి.

ముందసలు రైతులు కోరుతున్నట్టు ఇతర పంటలు కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొస్తే…ప్రభుత్వంపై పెను భారం పడుతుందన్న ఆందోళన ఉంది. అలాగే కనీస మద్దతు ధరకు పంట కొనాలంటే..నాణ్యత ఎలా నిర్ణయిస్తారన్నదానిపైనా సందేహాలున్నాయి. ఒకవేళ ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనేందుకు సిద్ధంగా ఉన్నా…మార్కెట్‌లో ప్రయివేట్ కంపెనీలు…అంతకన్నా ఎక్కువ ధర నిర్ణయిస్తే..రైతులు ఆ కంపెనీలకే అమ్ముతాయని..ఇటు రైతులను, అటు కంపెనీలను కట్టడి చేసే విధానాలు కేంద్రం దగ్గర లేవనే వాదన ఉంది.

మరోవైపు కాంగ్రెస్ వైఖరిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూపీఏ 2 హయాంలో కనీస మద్దతు ధర విషయంలో MS స్వామినాథన్ సిఫార్సులు అమలుచేయడానికి కేంద్రం సిద్ధంగా లేదని పార్లమెంట్‌లో లిఖితపూర్వక సమాధానమిచ్చింది. అలాంటిదిప్పుడు చట్టబద్ధత కల్పిస్తామని ఎలా ప్రకటిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మొత్తంగా ఎన్నికల ముందు అన్నదాతల ఆందోళనతో రాజకీయాలూ వేడెక్కాయి. దాదాపు అన్ని పార్టీల నేతలు ఆందోళనలపై స్పందించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. NDA కూటమి పార్టీలు ఆందోళనను వ్యతిరేకిస్తోంటే..ఇండియా కూటమి పార్టీలు, ఏ కూటమిలో చేరకుండా స్వతంత్రంగా ఉన్న పార్టీలు అన్నదాతలకు అండగా ఉంటున్నాయి.

అధికార, ప్రతిపక్షాల వైఖరిని పక్కనపెడితే….అన్నదాతలు మాత్రం ఎన్ని కష్టనష్టాలను తట్టుకునయినా..డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తామని రైతు సంఘాల నేతలంటున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగించినా.. లాఠీఛార్జ్ చేసినా…వెనక్కితగ్గబోమని….ఢిల్లీ వెళ్లి…దేశరాజధాని కేంద్రంగా పోరాటాలు చేస్తామని తెలిపారు.

AP Politics: ప్రైవేటు ఎన్నికలకు వెళ్లేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిర్ణయం