Farmers Protest Updates: కేంద్ర మంత్రులతో చర్చలు విఫలం.. 2500 ట్రాక్టర్లతో ఢిల్లీకి రైతులు.. సరిహద్దుల్లో హైఅలర్ట్

నిరసనకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ అంతటా 144 సెక్షన్ విధించారు.

Farmers Protest Updates: కేంద్ర మంత్రులతో చర్చలు విఫలం.. 2500 ట్రాక్టర్లతో ఢిల్లీకి రైతులు.. సరిహద్దుల్లో హైఅలర్ట్

Farmers Protest

Updated On : February 13, 2024 / 9:35 AM IST

Farmers Protest : ఢిల్లీ వేదికగా మరోసారి కదం తొక్కేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. తమ డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో.. ముందుగానే నిర్ణయించినట్లు ఢిల్లీ ఛలో పేరుతో మంగళవారం భారీ స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. ఢిల్లీ పోలీసుల ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ చలో మార్చ్ లో దాదాపు 20వేల మంది రైతులు 2500 ట్రాక్టర్లలో ఢిల్లీ సరిహద్దులకు చేరుకోవచ్చునని, హర్యానా, పంజాబ్ లోని అనేక సరిహద్దు ప్రాంతాల్లో నిరసనకారులు ఉన్నారని, వీరంతా ఎప్పుడైనా ఢిల్లీలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారని పేర్కొంది.

Also Read : Farmers Protest: ఢిల్లీకి దూసుకొస్తున్న రైతులు.. హైఅలర్ట్‌

నిరసనకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ అంతటా 144 సెక్షన్ విధించారు. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 12 వరకు ఈ రూల్స్ అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.  ప్రజలు గుమిగూడడం, ర్యాలీలు నిర్వహించడం చేయొద్దని హెచ్చరించారు.ట్రాక్టర్, ట్రాలీలపై నిషేధం విధించారు. మార్చి 12వ తేదీ వరకు ఢిల్లీలో భారీ బహిరంగ సమావేశాలు నిర్వహించడంపై నిషేదం విధించారు. మరోవైపు హర్యానాలోని ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఆర్ఏఎఫ్, సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇనుప కంచెలు, బారికేడ్లతో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో సిమెంటు దిమ్మెలు, కంటైనర్లు, క్రేన్లు, వాహనాలను భద్రతా బలగాలు అడ్డుగా నిలిపాయి. హర్యానా అంబాలా వద్ద పంజాబ్ – హర్యానా సరిహద్దును మూసివేశారు. ఢిల్లీ, యూపీ సరిహద్దు ఘాజీపూర్ వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

Also rRead : ఏపీ ప్రభుత్వంతో చర్చల తర్వాత ఉద్యోగ సంఘాల నేతల కీలక వ్యాఖ్యలు

కర్ణాటక నుంచి ఢిల్లీకి వచ్చే వందలాది మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. సింఘు, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దులు పోలీసుల వలయంలో ఉన్నాయి. అందిబాలా, జింద్ జిల్లాల్లో.. పంజాబ్ – హర్యానా సరిహద్దులను మూసివేశారు. ఢిల్లీ హర్యానా మధ్య 40 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రహదారులపై ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. రైతులను అరెస్టు చేసేందుకు హర్యానాలో తాత్కాలిక జైళ్లు సిద్ధం చేశారు. బస్టాండ్, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్ లలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.