ఢిల్లీ హింస ప్రభుత్వ కుట్రే..30న దేశవ్యాప్తంగా పబ్లిక్ ర్యాలీలు

ఢిల్లీ హింస ప్రభుత్వ కుట్రే..30న దేశవ్యాప్తంగా పబ్లిక్ ర్యాలీలు

Updated On : January 27, 2021 / 9:53 PM IST

govt conspiracy రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో హింసపై బుధవారం(జనవరి-27,2021)సాయంత్రం రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కుట్రకు కిసాన్ గణతంత్ర పరేడ్ బలైందని భారతీయ కిసాన్ యూనియన్(ఆర్) నేత బల్బీర్ ఎస్ రాజేవాల్ వ్యాఖ్యానించారు. సంయుక్త కిసాన్‌ మోర్చామాతో సంబంధంలేని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ సభ్యులను ముందు పెట్టి ఉద్రిక్తతలు జరిగేలా చేశారన్నారు.

ఎర్రకోట మార్గం తమ పరేడ్‌లో భాగం కాదని..కొంతమంది కుట్రపూరితంగా రైతుల కవాతును విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. రైతుల ర్యాలీని దెబ్బతీయాలని ప్రయత్నాలు జరిగినప్పటికీ..99శాతం మంది రైతులు శాంతియుతంగానే ర్యాలీలో పాల్గొన్నారన్నారు. ఎప్పటిలానే ఇకపై కూడా శాంతియుతంగా తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. కేంద్రం కొత్త సాగు చట్టాలు రద్దు చేసే వరకు వెనక్కి వెళ్లబోమని సృష్టం చేశారు.

అమరవీరుల దినోత్సవం(జనవరి-30) రోజున దేశవ్యాప్తంగా పబ్లిక్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు బల్బీర్ ఎస్ రాజేవాల్ తెలిపారు. అదేవిధంగా ఒకరోజు ఉపవాసం పాటిస్తామని తెలిపారు.అయితే, ఫిబ్రవరి 1న తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌ను నిన్నటి హింస కారణంగా రద్దు చేసుకుంటున్నామన్నారు.