Amarendra Dhari Singh : ఎరువుల కుంభకోణం..ఆర్జేడీ ఎంపీ అరెస్ట్
ఎరువుల దిగుమతి కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, రాజ్యసభ ఎంపీ అమరేంద్ర ధారి సింగ్ ను గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అరెస్టు చేసింది.

Amarendra Dhari Singh
Amarendra Dhari Singh ఎరువుల దిగుమతి కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, రాజ్యసభ ఎంపీ అమరేంద్ర ధారి సింగ్ ను గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)కింద అమరేంద్రను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ ప్రాంతంలో అమరేంద్రను అరెస్టు చేసినట్లు సమాచారం. బీహార్ రాజకీయాల్లో అమరేంద్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈయన సన్నిహితుడు. మూడు దశాబ్దాలుగా ఆయన వ్యాపార సామ్రాజ్యంలో ఉన్నారు.
కాగా,గత నెలలో మొదటగా ఫర్టిలైజర్ స్కామ్‌కు సంబంధించి దిగ్గజ ఎరువుల దిగుమతి కంపెనీలు IFFCO,IPL,జ్యోతి ట్రేడింగ్ కార్పొరేషన్ ల పై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. IFFCO,IPL, ఎండీలు యూఎస్ అవస్తీ, ప్రవీందర్ సింగ గహ్లౌత్, జ్యోతి ట్రేడింగ్ కార్పొరేషన్ కి వైస్ ప్రెసిడెంట్ అమరేంద్ర ధారి సింగ్ సహా మరికొందరిపై సీబీఐ కేసు నమోదుచేసింది.
ఎరువుల దిగుమతి స్కామ్
దిగ్గజ ఎరువుల దిగుమతి కంపెనీలుIFFCO,IPL… వివిధ విదేశీ సరఫరాదారుల నుండి వేలాది మెట్రిక్ టన్నుల ఎరువులు మరియు ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటాయి. రైతులకు సరసమైన ధరలకు సరఫరా చేయడానికి ఎరువులపై కేంద్ర ప్రభుత్వం వీటికి రాయితీలు అందిస్తుంది. అయితే అధిక సబ్సిడీలు పొందటానికి నేరపూరిత కుట్రలో భాగంగా IFFCO మేనేజింగ్ డైరెక్టర్ యుఎస్ అవస్తీ మరియు ఐపిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పిఎస్ గహ్లౌత్.. 2007-2014 వరకు ఎరువులను అధిక ద్రవ్యోల్బణ రేటుకు దిగుమతి చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
భారతదేశం వెలుపల రిజిస్టర్ చేయబడిన బహుళ సంస్థల ద్వారా…రూ .685 కోట్లకు పైగా విలువైన అక్రమ కమీషన్లను వాళ్లు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎంపి నిషికాంత్ దుబే మరియు బరేలీకి చెందిన సుదీష్ త్రిపాఠి.. రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సీబీఐ కేసు నమోదుచేసింది. మోసపూరిత లావాదేవీలను నిజమైనదిగా మభ్యపెట్టడానికి వారు ప్రయత్నించినట్లు సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ కుంభకోణంలో అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసు నిందితుడు, చార్టర్డ్ అకౌంటెంట్ రాజీవ్ సక్సేనా, జ్యోతి ట్రేడింగ్ కార్పొరేషన్ మరియు రేర్ ఎర్త్ గ్రూప్ యజమాని పంకజ్ జైన్, అతని సోదరుడు సంజయ్ జైన్ మరియు ఆర్జేడీ ఎంపీ అమరేంద్ర ధారి సింగ్ ప్రమేయం ఉందని ఎఫ్ఐఆర్ లో ఆరోపించారు.