చరిత్రలో ఫస్ట్ టైం : పరేడ్ లో మహిళల అద్భుత విన్యాసాలు

70వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఢిల్లీ రాజ్ పథ్ లో శనివారం(జనవరి 26, 2019) జరిగన పరేడ్ లో మహిళా శక్తి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పూర్తి మహిళా బృందంతో పాటు పలు బృందాలకు మహిళలు నాయకత్వం వహించి నారీ శక్తిని ప్రతిబింబించారు. పూర్తిగా మహిళలతో కూడిన పారామిలటరీ బృందం రాజ్ పథ్ వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ బృందంలో ఆర్మీలో భర్తల్ని కోల్పోయిన మహిళలు, కుటుంబసభ్యుల స్ఫూర్తితో సైన్యంలో చేరిన వారున్నారు.
బైక్ విన్యాసాలతో వీరు చూపరులను కట్టిపడేశారు. కార్ప్స్ ఆఫ్ సిగల్స్ కు చెందిన కెప్టెన్ శిఖా సురభి ఈ రోజు పరేడ్ లో పత్ర్యేక ఆకర్షణగా నిలిచింది. డేర్ డెవిల్స్ బృందంలో భాగంగా బైక్ పై ఆమె చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. బైక్ పై నిలబడి చేసిన అభివాదానికి వీక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. చప్పట్లతో ఆ ప్రాంగణం అంతా మార్మోగిపోయింది.
తొలిసారిగా భారత ఆర్మీ సర్వీసెస్ కార్ప్స్ బృందానికి మహిళా అధికారి నాయకత్వం వహించారు. లెఫ్టినెంట్ భావన కస్తూరి ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. నావికా దళ కాంటింజెంట్ కు లెఫ్టినెంట్ కమాండర్ అంబికా సుధాకరన్ నాయకత్వం వహించగా.. ట్రాన్స్ పోర్టబుల్ శాటిలైట్ టర్మినల్ కాంటింజెంట్ కు కెప్టెన్ భావన సయాల్ నాయకత్వం వహించారు. మహిళలతో కూడిన అసోం రైఫిల్స్ బృందం అద్భుత ప్రదర్శన ఇచ్చింది. వీరి బృందానికి మేజర్ కుష్బూ కన్వార్ నాయకత్వం వహించారు. కార్ప్స్ ఆఫ్ సిగల్స్ కు చెందిన కెప్టెన్ శిఖా సురభి ఈ రోజు పరేడ్ లో పత్ర్యేక ఆకర్షణగా నిలిచింది.