‘పొగ’మంచు : కాలువలోకి దూసుకెళ్లిన కారు..ఆరుగురు మృతి 

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 04:47 AM IST
‘పొగ’మంచు : కాలువలోకి దూసుకెళ్లిన కారు..ఆరుగురు మృతి 

Updated On : December 30, 2019 / 4:47 AM IST

ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేసింది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పొగమంచుతో దారులు కనపించక నోయిడాలో ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఆదివారం (డిసెంబర్ 29) రాత్రి జరిగిన డంకౌర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

డంకౌర్ ప్రాంతంలో Maruti Ertiga కారు ఖేర్లీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు మహేష్ (35) కిషన్ లాల్ (50)నీరేష్ (17), రామ్ ఖిలాడి (75), మల్లు (12), నేత్రపాల్ (40) గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం ఘటనపై సమాచారం అందుకున్న నోయిడా పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మరో ఐదుగురుని వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.  పొగమంచు కారణంగానే రహదారి కనిపించక కారు కాలువలోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు.   

కాగా దట్టంగా అలముకున్న పొగమంచు కారణంగా మూడు విమానాలకు దారి మళ్లించారు. మరో 67 విమానాలపై పొగమంచు ప్రభావం పడింది.  30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

ఉత్తరాద్రి రాష్ట్రాలన్ని వణికిపోతున్నాయి.  చలి పులి పంజాతో వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలు చలితో గజగజ వణుకుతున్నాయి. ఎముకలు కొరికే చలితో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, యూపీ, చండీఘడ్ రాష్ట్రాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది.

కశ్మీర్‌ లోయ, లఢక్‌ లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో హర్యానా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సోమ, మంగళవారాల్లో(డిసెంబర్ 30, 31,2019) విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. గత 5 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. జమ్ముకశ్మీర్‌లో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.