LK Advani : బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.. వైద్యులు ఏమన్నారంటే?
బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ (97) అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ను శనివారం ఉదయం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.

LK Advani
BJP Leader LK Advani : బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ (98) అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ను శనివారం ఉదయం చికిత్స నిమిత్తం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
అయితే, రెండు వారాలుగా అద్వానీ ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూలై నెలలో అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆరోగ్యం మెరుగుపడటంతో ఆయన్ను డిశ్చార్జి చేశారు. దానికి నెల రోజుల ముందు.. జూన్ 26న రాత్రి 10.30 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్ యూరాలజీ విభాగంలో అద్వానీ చికిత్స నిమిత్తం చేరారు. ఆ మరుసటి రోజే డిశ్చార్జి అయ్యారు. ఇదిలాఉంటే.. ఈ ఏడాది మార్చి 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్ కే అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన భారతరత్న పురస్కారాన్ని అందించారు.
లాల్ కృష్ణ అద్వానీ 1927 నవంబర్ 8న కరాచీలో (ఇది ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంది) జన్మించారు. గత నెల 8న అద్వానీ 98వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ నాయకులు, పలు పార్టీల్లోని రాజకీయ ప్రముఖులు అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
అద్వానీ 1942లో ఆర్ఎస్ఎస్ లో వాలంటీర్ గా చేరారు. 1986 నుంచి 1990 వరకు, మళ్లీ 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి అత్యధిక కాలం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు అద్వానీ. 1999 నుంచి 2005 వరకు అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో అద్వానీ కేంద్ర హోంమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో, బీజేపీ ఆయనను ప్రధానమంత్రిగా ప్రకటించింది. కానీ, ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాలేదు.