నువ్వే హీరోయిన్ అనగానే ఎగేసుకుని రూ.4కోట్లు ఇచ్చేసిన మాజీ సీఎం కూతురు.. కట్ చేస్తే..
హీరోయిన్‌ను చేస్తామని చెప్పిన వారి వలలో పడింది ఆమె.

Aarushi Nishank
సినిమాల్లో అవకాశాల కోసం చాలా మంది యువత ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వారిలో ఉన్న ఆశను ఆసరాగా చేసుకుని, సినిమాల్లో అవకాశం కల్పిస్తామని నమ్మించి, వారి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేస్తుంటారు కేటుగాళ్లు. తాజాగా ఓ అమ్మాయి కూడా ఇలాంటి వారి వలలోనే చిక్కుకుని రూ.4 కోట్లు పోగొట్టుకుంది. ఆమె ఎవరో కాదు ఓ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె.
ఉత్తరాఖండ్ మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ కుమార్తె పేరు ఆరుషి. ఆమె హిమశ్రీ ఫిల్మ్స్ పేరిట ఓ కంపెనీ నడుపుతోంది. యాక్టింగ్ కూడా చేస్తూ సినిమాలు నిర్మిస్తోంది. ఆమెను తల వలలో పడేసి, డబ్బులు లాగాలన్న ఉద్దేశంతో ముంబై జుహూ ప్రాంతానికి చెందిన మాన్సి వరుణ్ బాగ్లాతో పాటు వరుణ్ ప్రమోద్ కుమార్ బాగ్లా డెహ్రాడూన్ వచ్చి ఆమెను కలిశారు.
తమను మినీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉందని, తాము ఆ కంపెనీ డైరెక్టర్లమని చెప్పారు. షానయా కపూర్, విక్రమ్ మాస్సేతో త్వరలోనే ఓ సినిమాను నిర్మించనున్నట్లు తెలిపారు. తమ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇస్తామని ఆరుషికి చెప్పారు.
Chhattisgarh encounter: కాల్పులతో దద్దరిల్లిన అటవీ ప్రాంతం.. 31 మంది మావోయిస్టులు మృతి
తమ సినిమా కోసం రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టాలని తెలిపారు. కేవలం రూ.5 కోట్లు పెట్టుబడి పెడితే రూ.15 కోట్లు తిరిగి ఇస్తామని అన్నారు. ఇలా మరిన్ని మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించారు. గత ఏడాది అక్టోబర్ 9న.. నిర్మాతలుగా చెప్పుకుంటున్న ఆ ఇద్దరికి, ఆరుషి నిశాంక్‌కు ఒప్పందం చేసుకున్నారు.
ఎంవోయూపై సంతకాలు చేసుకున్నారు. వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్‌కు ఆరుషి మొదట రూ.2 కోట్లు ఇచ్చింది. ఆ తర్వాత విడతల వారిగా మరింత డబ్బు తీసుకున్నారు. మొత్తం రూ.4 కోట్లను ఆరుషి ఇచ్చింది. చివరకు ఈ నెల 5న ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. ఆమె నటించాల్సిన సినిమా షూటింగ్ పూర్తయిందని, హీరోయిన్ పాత్ర కోసం ఆరుషికి బదులుగా వేరొకరిని తీసుకున్నామని ఆ మెసేజ్‌లో ఉంది.
మోసపోయినట్లు గుర్తించిన ఆరుషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన డబ్బులను ఇవ్వాలని ఆరుషి నిందితులను అడిగినప్పటికీ వారు ఇవ్వలేదు. అంతేగాక, డబ్బులు ఇచ్చేయాలని అడిగితే చంపేస్తామని హెచ్చరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.