చికెన్ తో జాగ్రత్త : సగం ఉడికిన గుడ్లు, సరిగ్గా ఉడకని కోడి మాంసం వద్దు – FSSAI

half-boiled eggs : బర్డ్ ఫ్లూ డేoజర్ బెల్స్ మోగాయి. ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ భయం లేదంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వ యంత్రాంగం తొలిసారిగా జాగ్రత్తలు పాటించాలంటూ ప్రజలకు సూచించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తాజాగా కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తున్న కారణంగా పౌల్ట్రీ మాంసాన్ని, గుడ్లను ఆహారంగా తీసుకునే విషయంలో ప్రజలకు పలు సూచనలు చేసింది.
సగం ఉడికిన గుడ్లు, సరిగా ఉడకని కోడి మాంసాన్ని తినవద్దని FSSAI స్పష్టం చేసింది. పౌల్ట్రీ మాంసాన్ని సరైన రీతిలో ఉడికించాలని పేర్కొన్నది. బర్డ్ ఫ్లూ విషయంలో వినియోగదారులు కానీ వ్యాపారవేత్తలు కానీ ఆందోళన చెందవద్దు అని తెలిపింది. వీటితో పాటు బర్డ్ ఫ్లూ సోకిన ప్రదేశాల్లో పక్షులను తాకవద్దని హెచ్చరించింది. చనిపోయిన పక్షులను ఉత్త చేతులతో తాకొద్దని తెలిపింది. పచ్చి మాంసాన్ని బహిరంగంగా పెట్టవద్దని.. ఉడికించకుండా పచ్చి మాంసాన్ని నేరుగా తినకూడదని తేల్చి చెప్పింది.
ఫ్లూ ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లో పచ్చి మాంసం పట్టుకునే సమయంలో మాస్క్‌లు, గ్లౌజ్‌లు ధరించండం మంచిదని సలహా ఇచ్చింది. పౌల్డ్రీలలో పని చేసే వారు తరుచూ చేతులు కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.