ముంబై ఘాట్‌కోప‌ర్‌లో హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య

ముంబైలోని ఘట్‌కోపర్ ప్రాంతంలో హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఎన్‌డిఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో రెస్క్యూ అండ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది

ముంబై ఘాట్‌కోప‌ర్‌లో హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య

Mumbai Hoarding Collapse

Updated On : May 14, 2024 / 9:37 AM IST

Mumbai Hoarding Collapse : దేశీయ ఆర్థిక రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో సోమవారం (మే 13న) అత్యంత బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం అల్లకల్లోలం సృష్టించింది. నగరంలోని ఘట్కోపర్ ప్రాంతంలో పెట్రోల్ పంపుపై ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా భారీగా సంఖ్యలో వాహనదారులకు గాయాలయ్యాయి. పంత్‌నగర్‌లోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే వెంబడి పోలీస్ గ్రౌండ్ పెట్రోల్ పంపు వద్ద ఈ ఘటన జరిగింది. అయితే, తీవ్రంగా గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. మంగళవారం ఉదయం వరకు మృతుల సంఖ్య 14కు చేరింది. మరోవైపు హోర్డింగ్ కింద చిక్కుకున్న 74 మందిని సహాయక సిబ్బంది ప్రాణాలతో రక్షించారు. తీవ్రగాయాలైన పలువురు స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Also Read : Ap Elections 2024 : ఎమ్మెల్యే ఇంటిపై దాడి, రబ్బరు బుల్లెట్లు ప్రయోగం.. నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత

ఈ ప్రమాదం జరిగినప్పుడు పెట్రోల్ పంపుదగ్గర 100 మందికిపైగా ఉన్నారు. హోర్డింగ్ పడిపోవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పడిపోయిన భారీ హోర్డింగ్ కింద చిక్కుకున్న వారిని ప్రాణాలతో రక్షించారు. తెల్లవారు జామున వరకు హోర్డింగ్ లో చిక్కుకున్న మొత్తం 86 మందిని రక్షించి చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న 74 మందిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గాయపడ్డవారిలో 31 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.

Also Read : Viral Video : ముంబైలో ధూళి తుఫాను.. కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు

ఘటన తరువాత బిల్ బోర్డ్ తయారీ ఏజెన్సీ, దాని యాజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో హోర్డింగ్ యజమాని భవేష్ బిండే, ఇతరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తరువాత బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తమ అనుమతి లేకుండా బిల్ బోర్డ్ ను తయారు చేశారంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.