పారికర్ కు భారతరత్న!

  • Published By: venkaiahnaidu ,Published On : March 24, 2019 / 01:48 PM IST
పారికర్ కు భారతరత్న!

Updated On : March 24, 2019 / 1:48 PM IST

గోవా దివంగత సీఎం మనోహర్‌ పారికర్‌ పేరును వచ్చే సంవత్సరానికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ప్రతిపాదించాలని గోవా ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత సీఎం  ప్రమోద్‌ సావంత్‌ నుంచి ఈ ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అక్కడి నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సీఎంవోకి చెందిన ఓ అధికారి తెలిపారు. దీనిపై ఆయన త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని అధికారులు తెలిపారు. పారికర్‌ కి అత్యంత సన్నిహితుల్లో ప్రమోద్‌ సావంత్ ఒకరు.పారికర్ కు భారతరత్న నిర్ణయాన్ని బీజేపీ నాయకురాలు శయినా ఎన్‌ సీ స్వాగతించారు.

గోవా ప్రజలకే కాకుండా దేశం మొత్తానికి పారికర్‌ సేవలు అందించారన్నారు. ఎంతో మందికి ఆయన స్పూర్తిగా నిలిచారన్నారు. భారతరత్న ఇవ్వడం పారికర్‌కి సరైన నివాళి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దక్షిణ గోవాలో నిర్మించిన ఓ నూతన వంతెనకు పారికర్‌ పేరుతో నామకరణం చేయాలని మహారాష్ట్ర గోమంతక్‌ పార్టీ నేత, పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సుధిన్‌ ధావలికర్‌ నిర్ణయించారు. క్లోమగ్రంథి క్యాన్సర్ తో బాధపడుతూ మార్చి-17,2019న మనోహర్ పారికర్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.