రైల్వేశాఖ గుడ్‌ న్యూస్ : హమ్‌ సఫర్ రైళ్ల టికెట్ ధరల తగ్గింపు

  • Published By: madhu ,Published On : September 14, 2019 / 09:33 AM IST
రైల్వేశాఖ గుడ్‌ న్యూస్ : హమ్‌ సఫర్ రైళ్ల టికెట్ ధరల తగ్గింపు

Updated On : September 14, 2019 / 9:33 AM IST

ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏసీ బోగీలతో అధునాతన సౌకర్యాలున్న హమ్‌సఫర్ రైళ్ల టికెట్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రీమియమ్ హమ్‌ సఫర్ రైళ్లలో..  ఫ్లెక్సీ విధానాన్ని రద్దు చేసింది. అంతేకాదు కేవలం థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లున్న ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్‌లను కూడా అందుబాటులోకి తెస్తామని అధికారులు వెల్లడించారు. అత్యున్నత ప్రమాణాలు కలిగిన సదుపాయాలను తక్కువ ధరకే ప్రయాణికులకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
 
ప్రస్తుతం హమ్‌సఫర్ రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ విధానం ఉంది. 50శాతం సీట్లను సాధారణ పద్దతిలో అమ్మి.. మిగతా 50 సీట్లను బెర్తులు నిండేకొద్దీ చార్జీలు పెంచే విధానంలో కేటాయించేవారు. ఇకపై ఆ విధానం ఉండదు. ఒకే ధర ఉండేలా ఫిక్స్‌డ్ ఫేర్ విధానాన్ని అమలు చేస్తారు. అంతేకాదు తత్కాల్ టికెట్ల ధరలను కూడా తగ్గించారు. ఇంతకు ముందు బేస్ ధర కంటే 1.5 రెట్లు అధికంగా తత్కాల్ టికెట్ల రేట్లు ఉండేవి.

దాన్ని 1.3 రెట్లకు తగ్గించారు. ఇక ఫస్ట్ చార్టింగ్ పూర్తయ్యాక కరెంట్ బుకింగ్ ద్వారా అమ్మే టికెట్లను 10శాతం తక్కువ ధరకే అమ్ముతారు. 2016, డిసెంబర్ నెలలో హమ్ సఫర్ రైళ్లను రైల్వే శాఖ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ రైళ్లు దేశ వ్యాప్తంగా 70 వరకు ఉన్నాయి. వీటిలో 50 శాతం బెర్తులను సాధారణ ఎక్స్ ప్రెస్ / మెయిల్ రైళ్లతో పోలిస్తే 1.5 శాతం అధిక ఛార్జీలతో భర్తీ చేసేవారు. 
Read More : దేశానికి ఒకటే భాష ఉండాలి..అది హిందీ అయి ఉండాలి : అమిత్ షా