Nimesulide: ఆ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారా? బీకేర్ ఫుల్.. నిషేధం విధించిన కేంద్రం.. దగ్గు మందులపైనా..

మూత్రపిండాలు లేదా కాలేయ సమస్యలు ఉన్న రోగులకు నిమెసులైడ్‌ను సూచించకూడదని కూడా సిఫార్సు చేసింది.

Nimesulide: ఆ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారా? బీకేర్ ఫుల్.. నిషేధం విధించిన కేంద్రం.. దగ్గు మందులపైనా..

Nimesulide Representative Image (Image Credit To Original Source)

Updated On : January 1, 2026 / 6:13 PM IST
  • నిమెసులైడ్ పెయిన్ కిల్లర్ అధిక డోసులపై కేంద్రం నిషేధం
  • టెస్టుల్లో కాలేయం దెబ్బతింటుందని గుర్తించిన కేంద్రం
  • ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్టాక్ కూడా రీకాల్

Nimesulide: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిమెసులైడ్ అధిక డోసులపై నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. మన దేశంలో నొప్పి నివారణకు అధికంగా వాడే మాత్రల్లో నిమెసులైడ్ ఒకటి. నొప్పి, జ్వరాన్ని తగ్గించే ఔషధమే ఈ నిమెసులైడ్. ఇదొక నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ డ్రగ్. అయితే, ఈ మందులను ఎక్కువ మోతాదులో తీసుకుంటే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. కిడ్నీలపైనా ప్రభావం చూపుతుంది.

ఈ క్రమంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. దీని వాడకంపై ఆంక్షలు విధించింది. హెల్త్ రిస్క్ కారణాలతో నిమెసులైడ్‌ 100 ఎంజీకి మించి డోసు ఉండే ఔషధాల తయారీ, విక్రయాలు, పంపిణీ తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అంటే.. ఇకపై మార్కెట్ లో 100mg మోతాదుగల నిమెసులైడ్ మాత్రలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంతకంటే ఎక్కువ పవర్ లేదా మోతాదు ఉన్నవి తయారు చేయకూడదు, అమ్మకూడదు.

స్టాక్ వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు..

కేంద్రం తాజా ఆదేశాలతో నిమెసులైడ్ ఆధారిత పెయిన్‌ కిల్లర్‌ బ్రాండ్లను తయారు చేసే ఫార్మా కంపెనీలు వెంటనే తమ ప్రొడక్షన్ నిలిపేయాల్సి ఉంటుంది. అంతేకాదు మార్కెట్ లో ఉన్న స్టాక్‌ను (అధిక మోతాదు) వెనక్కి తీసుకోవాలని ఫార్మా కంపెనీలను కేంద్రం ఆదేశించింది. దీనికి బదులుగా సురక్షితమైన, ఆరోగ్యకరమైన, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఇతర నొప్పి నివారణ మందులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయని, వాటినే వాడాలని కేంద్రం సూచించింది. నిమెసులైడ్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు దీనిపై నిషేధం విధించాయి.

అదే సమయంలో, దగ్గు మందులను ఓవర్-ది-కౌంటర్ మందుల జాబితా నుండి తొలగిస్తూ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖఒక ముసాయిదా నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. ఇది రిజిస్టర్డ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం నుండి మినహాయించబడిన మందుల జాబితా షెడ్యూల్ కె నుండి “దగ్గు కోసం సిరప్‌లను” తొలగిస్తుంది. దగ్గు కోసం ఉండే లాజెంజెస్, మాత్రలు లేదా టాబ్లెట్లు ఈ జాబితాలో కొనసాగుతాయి.

కలుషితమైన దగ్గు సిరప్‌లను సేవించి మధ్యప్రదేశ్‌లో కనీసం 22 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లలకు ఇవ్వకూడని దగ్గు సిరప్‌లను ఇవ్వడం వల్ల వారు మరణించిన సందర్భాలు ఉన్నాయి.

Nimesulide Tablet

Nimesulide Tablet Representative Image (Image Credit To Original Source)

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు అస్సలు వాడొద్దు..

ఆరోగ్యంపై నిమెసులైడ్ దుష్ప్రభావాన్ని సమీక్షించిన తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన సిఫార్సులలో కొన్ని నిమెసులైడ్ ఫార్ములేషన్లను నిషేధించడం ఒకటి. నిమెసులైడ్ కొన్ని సందర్భాల్లో కాలేయానికి విషపూరిత ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇతర మందులు పనిచేయని సందర్భాలలో లేదా వాటిని సూచించడం సాధ్యం కాని సందర్భాలలో మాత్రమే ఈ మందును రెండవ శ్రేణి చికిత్సగా ఉపయోగించాలని సూచించే ఒక సిఫార్సు కూడా ఉంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, గర్భం ధరించడానికి ప్రణాళిక వేస్తున్న మహిళలు ఈ మందును ఉపయోగించకూడదని కూడా ఐసీఎంఆర్ సిఫార్సు చేసింది.

మూత్రపిండాలు లేదా కాలేయ సమస్యలు ఉన్న రోగులకు నిమెసులైడ్‌ను సూచించకూడదని కూడా సిఫార్సు చేసింది. కాలేయానికి లేదా మూత్రపిండాలకు హాని కలిగించే ఇతర మందులతో పాటు దీనిని ఇవ్వకూడదు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు దీనిని వాడకూడదని ఇప్పటికే నిషేధం విధించారు. వివిధ వయసుల వారిపై ఈ మందు వాడకం వల్ల కలిగే ప్రభావాలను సమీక్షించాలని కూడా కమిటీ ఐసిఎంఆర్‌ను కోరింది. 12 ఏళ్లలోపు పిల్లలు, 12 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు, 60 ఏళ్లు పైబడిన వారిపై దీని ప్రభావం ఎలా ఉంటుందో సమీక్షించాలని సూచించింది.