మరణించిన రైతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం : పంజాబ్ సీఎం

మరణించిన రైతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం : పంజాబ్ సీఎం

Updated On : January 22, 2021 / 9:19 PM IST

Govt job for kin పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు శుక్రవారం(జనవరి-22,2021) సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతుల్లో 76మంది ప్రాణాలు కోల్పోయినట్లు తనకు నివేదిక అందిందని అమరీందర్ చెప్పారు. పంజాబ్ కి చెందిన బాధిత కుటంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని అమరీందర్ ప్రకటించారు.

కాగా, గురువారం సీఎం అమరీందర్ సింగ్ ఆదేశాల మేరకు ఢిల్లీ ఆందోళనల్లో మరణించిన లుథియానాకి చెందిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల పరిహారాన్ని అందించినట్లు లుథియానా డిప్యూటీ కమిషనర్ వరీందర్ శర్మ తెలిపారు.

రిపోర్టుల ప్రకారం..రైతుల ఆందోళన సమయంలో 135మంది మరణించారు. ఇందులో ఐదుగరు ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన మరణాలు సహజ కారణాలతో సంభవించినవి మరియు రోడ్డు ప్రమాదాల్లో జరిగినవి. చాలావరకు మరణాలు తీవ్రవైన చలికారణంగానే సంభవించినట్లు డాక్టర్లు తెలిపారు. ఆందోళన సమయంలో మరణించిన అన్నదాతలకు రిపబ్లిక్ డే రోజున ప్రతిపాదిత ట్రాక్టర్ ర్యాలీ వద్ద నివాళులర్పించాలని రైతులు ఫ్లాన్ చేశారు.