Bharat Rice : సామాన్యులకు పండుగే.. భారత్ రైస్ వచ్చేసింది.. కిలో ధర కేవలం రూ.29 మాత్రమే.. ఎలా కొనుగోలు చేయాలంటే?

Bharat Rice : కేంద్రీయ భండార్ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అన్ని భౌతిక, మొబైల్ అవుట్‌లెట్లలో భారత్ రైస్ అందుబాటులో ఉంటుంది.

Bharat Rice : సామాన్యులకు పండుగే.. భారత్ రైస్ వచ్చేసింది.. కిలో ధర కేవలం రూ.29 మాత్రమే.. ఎలా కొనుగోలు చేయాలంటే?

Govt launches Bharat rice at Rs 29 per kg to provide to relief to customers

Bharat Rice : పెరుగుతున్న ఆహార ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 6న ‘భారత్ రైస్’ని కిలోకు రూ. 29 సబ్సిడీతో ప్రారంభించింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌‌లో భారత్ రైస్ విక్రయాలను కేంద్రఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు.

అంతేకాదు.. భారత్ రైస్ విక్రయించే 100 మొబైల్ వ్యాన్‌లను కూడా గోయల్ జెండా ఊపి ప్రారంభించారు. తొలి దశలో ఈరోజు (మంగళవారం) నుంచి కేంద్రీయ భండార్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED) నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) అన్ని భౌతిక, మొబైల్ అవుట్‌లెట్లలో భారత్ రైస్ అందుబాటులో ఉంటుంది.

Read Also : Tech Companies Layoffs 2024 : టెక్ పరిశ్రమలో ఆగని ఉద్యోగాల కోతలు.. 2024లో ఏకంగా 32వేల మంది ఇంటికి.. ప్రధాన కారణాలివే..!

 త్వరలో ఈ.కామర్స్ వెబ్ సైట్లలో అందుబాటులోకి :
ఇందుకోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ (FBI) సరఫరా చేస్తోంది. సబ్సిడీ బియ్యం 5 కిలోలు, 10 కిలోల ప్యాక్‌లలో వినియోగానికి అందుబాటులో ఉంటుంది. త్వరలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో భారత్ రైస్ అందుబాటులోకి రానుంది. రాబోయే రోజుల్లో సామాన్య ప్రజలకు భారీ ఉపశమనం కలగనుంది. అన్నం ఎక్కువగా తినే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల ప్రజలకు ఈ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సబ్సిడీ బియ్యాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల అవసరాల పట్ల సున్నితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచడం ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుందన్నారు.

భారత్‌ రైస్ ప్రారంభానికి ముందు నుంచే 5 కిలోలు, 10 కిలోల ప్యాకెట్లలో కిలో రూ.27.50కి విక్రయిస్తున్నారు. అలాగే భారత్ పప్పు (చాన పప్పు) కూడా కిలో రూ.60కి విక్రయిస్తున్నారు. రైతులతో పాటు దేశ ప్రజల సంక్షేమానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అన్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసి వినియోగదారులకు అవసరమైనప్పుడు సబ్సిడీ ధరలకు విక్రయిస్తుంది. 2023-24లో ఎగుమతులు, ఉత్పత్తిపై పరిమితులు ఉన్నప్పటికీ బియ్యం రిటైల్ ధరలు ఇంకా నియంత్రణలో లేవు. రిటైలర్లు, హోల్‌సేలర్లు, ప్రాసెసర్లు, పెద్ద రిటైల్ చైన్‌లు హోర్డింగ్‌ను చెక్ చేయడానికి తమ స్టాక్‌లను వెల్లడించాలని ప్రభుత్వం కోరింది.

ఈ కార్యక్రమంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు సాధ్వి నిరంజన్ జ్యోతి, అశ్విని చౌబే, ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) సిఎండి అశోక్ కె మీనా తదితరులు పాల్గొన్నారు.

Read Also : Paytm Crisis : పేటీఎం సంక్షోభం మధ్య ఫోన్‌పే, గూగుల్ పే, భీమ్ యాప్‌లకు ఫుల్ డిమాండ్.. 50శాతం పెరిగిన డౌన్‌లోడ్‌లు!